బద్వేలు అర్బన్ : నెల రోజుల క్రితం జరిగిన చిన్నపాటి ఘర్షణను దృష్టిలో ఉంచుకుని అన్నదమ్ములపై ఓ యువకుడు కత్తితో దాడి చేసిన ఘటన మంగళవారం అర్ధరాత్రి బద్వేలు పట్టణంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే మున్సిపాలిటీ పరిధిలోని భావనారాయణనగర్‌కు చెందిన నడిపికొండయ్య, నాగేశ్వరి కుమారులైన వెంకటమదన్, దినేష్‌లకు కడపకు చెందిన యశ్వంత్ అనే యువకుడి నడుమ నెల రోజుల క్రితం స్కూటీ యాక్సిడెంట్ విషయమై చిన్నపాటి ఘర్షణ జరిగింది. ఇటీవల కడప నుండి బద్వేలులోని తన సమీప బంధువుల ఇంటికి వచ్చిన యశ్వంత్ యాక్సిడెంట్ విషయమై మాట్లాడుకుందామని వెంకటమదన్, దినేష్‌లను గుంతపల్లె క్రాస్‌రోడ్డులోకి పిలిపించాడు. అక్కడ మాటమాట పెరగడంతో యశ్వంత్ ఒక్కసారిగా ఇరువురు అన్నదమ్ములపై కత్తితో దాడి చేసి అక్కడి నుండి పరారయ్యాడు. వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని గాయపడిన అన్నదమ్ములను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఇరువురిని కడప రిమ్స్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న అర్బన్ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి గాయపడిన వారి నుండి ఘర్షణ జరగడానికి గల కారణాలను తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న అర్బన్ పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.


