●వ్యవస్థలు నిర్వీర్యం...ప్రేక్షక పాత్రే శరణ్యం... | - | Sakshi
Sakshi News home page

●వ్యవస్థలు నిర్వీర్యం...ప్రేక్షక పాత్రే శరణ్యం...

Sep 17 2026 12:14 AM | Updated on Sep 17 2026 12:14 AM

●వ్యవస్థలు నిర్వీర్యం...ప్రేక్షక పాత్రే శరణ్యం...

సాక్షి ప్రతినిధి, కడప: ‘తస్మాత్‌ జాగ్రత్త...దొంగల్లారా....పారిపోండి’ అచ్చం ఇదే తీరులో జిల్లా అధికారులు ఉండిపోయారు. అనేక ఫిర్యాదులు, పత్రికా కథనాలు తర్వాత అక్రమ మైనింగ్‌ కట్టడి కోసం మూకుమ్మడి తనిఖీలు చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ముందే కొంతమంది అధికారులు అక్రమార్కులకు తెలియజేశారు. ఆపై బుధవారం పోలీసు, రెవెన్యూ, మైనింగ్‌, రీజినల్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు జాయింట్‌ ఇన్స్‌ఫెక్షన్‌కు వెళ్లారు. అక్రమార్కులెవ్వరూ అక్కడ లేరు, ఎలాంటి అక్రమ మైనింగ్‌ చేపట్టలేదని తేల్చేశారు. రీజినల్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సైతం చేతులు ఊపుకుంటూ ఎలా వెళ్లారో...అలానే వెనక్కు తిరిగిరావాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది.

జిల్లాలో వేముల, వేంపల్లె మండలాలల్లో బైరెటీస్‌ నిక్షేపాల దోపిడీ బహిరంగంగా కొనసాగుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్చగా అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారు. మరోవైపు మైన్‌ లీజుదారుల అనుమతులతో నిమిత్తం లేకుండా, రాయల్టీ ఫీజు చెల్లించకుండా దౌర్జన్యంగా అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారు. ఈ వ్యవహారం మండలస్థాయిలో రెవెన్యూ, పోలీసుశాఖల నుంచి జిల్లా కేంద్రం, ఆపై రాష్ట్రస్థాయిలో తుదకు సీఎంఓ స్థాయి వరకు ఫిర్యాదులు వెళ్లాయి. ఈపరంపరలో జాయింట్‌ ఇన్స్‌ఫెక్షన్‌ చేపట్టాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. మైనింగ్‌ డీడీ, రీజినల్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, పోలీసు, రెవెన్యూశాఖల అధికారులతో మూకుమ్మడిగా నిర్వహించాలని ఆదేశించారు. ఆ మేరకు బుధవారం తనిఖీలు చేయనున్నట్లు మండల కేంద్రమైన వేములకు ఆదేశాలు జారీ అయ్యాయి. అంతే ఎక్కడికక్కడ అక్రమార్కులు అప్రమత్తమయ్యారు. అక్రమంగా పోగేసుకున్న బైరెటీస్‌ నిల్వలు తరలించుకెళ్లారు. మంగళవారం సాయంత్రానికి అక్రమంగా ఏర్పాటు చేసుకున్న క్రేన్లు సైతం తీసేశారు. బుధవారం వెళ్లిన అధికారులకు ఆ ప్రాంతంలో ఏమాత్రం అక్రమ మైనింగ్‌ అనవాళ్లు కన్పించలేదు. ఉన్నతాధికారులు సైతం జాయింట్‌ ఇన్స్‌ఫెక్షన్‌ను మమ అన్పించారు.

లీజులున్నా అక్రమార్కుల కనుసన్నుల్లోనే...

వేముల, వేంపల్లె మండలాల్లో రెండేళ్లుగా అక్రమ మైనింగ్‌ యథేచ్చగా కొనసాగుతోంది. లీజు అనుమతులు ఉన్న వారైనా సరే, అక్రమార్కుల కనుసన్నుల్లోనే మైనింగ్‌ నిర్వహించాలనే నిబంధనలు తెరపైకి వచ్చాయి. వేముల, వి.కొత్తపల్లె, వేంపల్లె మండలంలోని బక్కన్నగారిపల్లె, తాళ్లపల్లె గ్రామాల్లో ఈ దందా కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలాంటి అనుమతులు లేకుండా బైరెటీస్‌ నిక్షేపాలను కొల్లగొడుతున్నారు. అక్రమ మైనింగ్‌ ద్వారా ఆదాయం గడించడం ఒక మార్గమైతే... దౌర్జన్యం, దోపిడీలతో కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. తుదకు టిఫిన్‌ బురైటీస్‌ ప్రాంగణంలో నేషనల్‌ కంపెనీ ఆఫ్‌ లా ట్రిబ్యునల్‌ (ఎన్సీఎల్టీ) ద్వారా వేలంలో ఎంబసీ గ్రూపు కొనుగోలు చేసి ఉంచిన 3,500టన్నుల నిల్వలను కూడా 2025 సంక్రాంతి పండగ నాడు దౌర్జన్యంగా తరలించుకెళ్లారు. ఓవైపు ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో రావాల్సిన ఆదాయం దక్కకపోగా, మరోవైపు యజమానులతో నిమిత్తం లేకుండా దౌర్జన్యంగా మైనింగ్‌ నిర్వహిస్తూ తెలుగుతమ్ముళ్లు కోట్లు గడిస్తున్నారని పలువురు వివరిస్తున్నారు.

ప్రకృతి సంపద దోపిడీ...

ఓ వైపు విలువైన ఖనిజాలు, మరోవైపు ఇసుక ద్వారా తెలుగుతమ్ముళ్లు దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రకృతి సంపద కారణంగా కోట్లకు పడుగలెత్తుతున్నారు. ఇదేమి అన్యాయమంటే తెగబడి ప్రత్యక్ష దాడులకు దిగుతున్నారు. మంగళవారం వేంపల్లెలో అక్రమంగా ఇసుక తరలించుకెళ్లడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తే టీడీపీ నేతలు రైతులపై చెలరేగిపోయారు. ఇలాంటి పరిస్థితులను కళ్లుండీ చూడలేని స్థితిలో అధికారులు ఉండిపోయారని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. ఈక్రమంలోనే అన్నీశాఖల అధికారులు బుధవారం జాయింట్‌ ఇన్స్‌ఫెక్షన్‌ చేసినా బైరెటీస్‌ ఖనిజాన్ని కొల్లగొడుతున్న నిర్వాహకులను కట్టడి చేయలేకున్నారని విశ్లేషకులు సైతం ఆరోపిస్తున్నారు.

రెవెన్యూ, పోలీసు, విజిలెన్స్‌– ఎన్‌ఫోర్స్‌మెంట్‌, మైనింగ్‌ శాఖ ఉమ్మడి తనిఖీలు

ముందు రోజు ఎక్కడికక్కడా

అక్రమార్కులు గప్‌చిప్‌

అక్రమ మైనింగ్‌ కట్టడిపై

అధికారులకు చిత్తశుద్ధి లేమి

టిఫెన్‌ బైరెటీస్‌ ప్రాంగణంలో

మమ అన్పించిన అధికారులు

వేముల, వేంపల్లె మండలాల్లో

యథేచ్చగా దందా

వ్యవస్థలు తనంతట తానుగా రాజ్యాంగానికి లోబడి వ్యవహరిస్తే, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అప్పుడే కొంతలో కొంతైనా ప్రజల ధన, మాన ప్రాణాలకు రక్షణగా నిలుస్తోంది. వ్యవస్థలు నిర్వీర్యం అయితే దౌర్జన్యపరులదే రాజ్యం, దోపిడీ దారులదే భోజ్యం అన్నట్లుగా ఉండిపోతుంది. ఇప్పుడు వేముల, వేంపల్లె మండలాల్లో అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో ఇదే చోటుచేసుకుంది. అధికారులు ప్రేక్షక పాత్రను పోషిస్తున్నారు. ప్రభుత్వం అన్ని శాఖలను సమన్వయపర్చి జాయింట్‌ ఇన్స్‌ఫెక్షన్‌కు ఆదేశించినా, పట్టుమని పది రాళ్లు కూడా బైరెటీస్‌ ఖనిజాన్ని పట్టుకోలేకపోయారు. అందుకు కారణం కొంతమంది అధికారులు అక్రమార్కులకు అండగా నిలుస్తుండడమేనని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement