● గణనాథునికి ఘనంగా వీడ్కోలు ● 70 శాతం విగ్రహాలు నిమజ్జనం
కడప సిటీ : ఆదిపూజల దేవుడు...ఆది దంపతుల సుతుడు...బొజ్జ గణపయ్య నిమజ్జనాన్ని బుధవారం మూడవరోజు భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జిల్లా కేంద్రమైన కడపతోపాటు ప్రొద్దుటూరు, పులివెందుల, కమలాపురం, బద్వేలు, జమ్మలమడుగు, మైదుకూరు, రాజంపేట తదితర ప్రాంతాలలో మూడు రోజులు భక్తిశ్రద్ధలతో పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పటికే జిల్లాలో చిన్నా, పెద్ద విగ్రహాలను దాదాపు 70 శాతం మేర నిమజ్జనం చేశారు. తొలుత భక్తులకు అన్నదానాలు చేశారు. ఆపై స్వామి ని పందిళ్లలో నుంచి వాహనాలపై చేర్చి నిమజ్జనానికి తరలించారు.
సందడే సందడి
జైబోలో గణేష్ మహరాజ్‌కీ....గణపతి బొప్పమోరియా.. నినాదాలతో నిమజ్జన దారులు హోరెత్తాయి. తప్పెట్లు, చెక్కభజనలు, బ్యాండుమేళాలు, భక్తి గీతాలాపనలు, యువకుల ఈలలు, కేరింతల మధ్య కట్టల తెగిన ఉత్సాహం మధ్య గణపతి నిమజ్జనం ఘనంగా జరిగింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి వరకు జిల్లాలో గణపయ్య విగ్రహాల నిమజ్జనం కొనసాగింది. ఈ సందర్భంగా పలుచోట్ల గణపతి చేతిలో పూజలందుకున్న లడ్డూల వేలం పాటలు, ఉట్టికొట్టడం, మహిళలకు ముగ్గుల పోటీలు, బాలలకు వివిధ రకాల పోటీలను ఏర్పాటు చేసి బహుమతులు ఇవ్వడం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. కడప నగర పరిధిలోని ఇర్కాన్ సర్కిల్ వద్ద, దుర్గమ్మ ఆలయం సమీపం, ఫాతిమా కళాశాల వద్దగల కేసీ కెనాల్‌లో నిమజ్జనం చేశారు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో విస్తృతమైన పోలీసు బందోబస్తు నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది నిరంతరం కార్యక్రమాలను పర్యవేక్షించి పారిశుద్ద్య పనులు నిర్వహించారు.
చిట్టి గణపయ్యను నిమజ్జనానికి తీసుకెళ్తూ..
వీఎన్‌పల్లెలో గ్రామోత్సవంలో గణనాథులు


