ట్రాఫిక్‌ క్లియర్‌ చేస్తున్న యువకుడిపై దాడి | - | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌ క్లియర్‌ చేస్తున్న యువకుడిపై దాడి

Sep 16 2026 3:43 AM | Updated on Sep 16 2026 3:43 AM

● బాధితుడికి కన్ను పోయే పరిస్థితి

● పోలీసుల అదుపులో ఇద్దరు యువకులు

ప్రొద్దుటూరు క్రైం : చిన్నవీధిలో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడటంతో వాహనాన్ని కాస్త వెనక్కి తీసుకోవాలని సూచించిన ఓ యువకుడిపై ఇద్దరు యువకులు కర్రలతో దారుణంగా దాడి చేసిన ఘటన పట్టణంలోని గౌరమ్మకట్ట వీధిలో అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఈ దాడిలో పట్టణానికి చెందిన ధనుష్‌ కుమార్‌ అనే యువకుడి కంటికి తీవ్ర గాయమైంది. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ధనుష్‌ను తిరుపతిలోని అరవింద్‌ కంటి ఆస్పత్రికి తరలించారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల మేరకు.. గౌరమ్మకట్ట వీధిలో యువకులు వినాయకుడి మండపాన్ని ఏర్పాటు చేశారు. అన్ని చోట్లా పోలీసులు ఉండలేరు కాబట్టి అక్కడి యువకులే ట్రాఫిక్‌ను క్లియర్‌ చేసే బాధ్యతను తీసుకున్నారు. వాహనాలు ఎదురెదురుగా వచ్చినప్పుడు సంబంధిత వాహన యజమానులు, డ్రైవర్లకు సూచనలు ఇస్తూ.. ట్రాఫిక్‌ను క్లియర్‌ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అదే వీధిలో రెండు కార్లు ఎదురెదురుగా రావడంతో రాకపోకలకు అంతరాయం కలిగి ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. దీంతో అక్కడే ఉన్న ధనుష్‌కుమార్‌ అనే యువకుడు ట్రాఫిక్‌ క్లియర్‌ అయ్యే వరకు వాహనాన్ని కాస్త వెనక్కి తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది. ఆగ్రహానికి గురైన కారులోని ఇద్దరు యువకులు ఒక్కసారిగా కిందికి దిగి ధనుష్‌పై కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో ధనుష్‌ కంటికి తీవ్ర గాయమైంది. పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు హుటాహుటీనా తిరుపతికి తరలించారు. ప్రాణాపాయం నుంచి నివారించేందుకు తీవ్రంగా దెబ్బతిన్న కంటిని తొలగించాల్సిన పరిస్థితి ఉందని కుటుంబ సభ్యులకు వైద్యులు చెప్పినట్లు సమాచారం. అందరూ ఆనందోత్సాహాలతో వినాయకచవితి వేడుకలు జరుపుకొంటున్న వేళ.. ధనుష్‌ కుటుంబంలో మాత్రం విషాదం నెలకొంది. ట్రాఫిక్‌ స్తభించిన సమయంలో సాయం చేయబోయిన యువకుడిపై అమానుషంగా దాడి చేయడం ఆ కుటుంబంలో తీరని వేదనను మిగిల్చింది.

సీసీ కెమెరాల్లో దాడి దృశ్యాలు

కాగా దాడికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వాటి ఆధారంగా గుర్తించిన పోలీసులు పట్టణానికి చెందిన సంతోష్‌కుమార్‌రెడ్డి, భార్గవ్‌కుమార్‌రెడ్డి అనే యువకులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. వారిరువురూ యువకుడిపై దాడి చేయడంతోపాటు వాహనాల అద్దాలను కూడా ధ్వంసం చేసినట్లు కెమెరాల్లో రికార్డయింది. ఘటనకు గల కారణాలు, దాడి సమయంలో వారు మద్యం తాగి ఉన్నారా తదితర అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు టూ టౌన్‌ సీఐ వంశీనాథ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement