ఖాజీపేట : ద్విచక్ర వాహనంపై యూరియా బస్తాను తీసుకువెళ్తున్న రైతు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. అప్పనపల్లె గ్రామానికి చెందిన చెన్నూరు నాగేశ్వరయ్య (55) తన బైక్‌పై పంట పొలంలో యూరియా చల్లేందుకు సోమవారం బస్తాను తీసుకెళ్తున్నాడు. నాగసానిపల్లెలోని పొలం వద్దకు వెళ్లే ప్రయత్నంలో బైక్ అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. నాగేశ్వరయ్య తల పోల్‌కు బలంగా తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు.
గండి హుండీ ఆదాయం లెక్కింపు
చక్రాయపేట : ప్రసిద్ధి గాంచిన గండి వీరాంజనేయస్వామి దేవస్థానానికి హుండీల ద్వారా రూ.47,90,134 ఆదాయం వచ్చినట్లు ఆలయ సహాయ కమిషనర్ విశ్వనాథ్ తెలిపారు. మంగళవారం ఆయనతోపాటు కడప పక్కీరుపల్లె శ్రీరామస్వామి దేవాలయ గ్రేడ్–2 ఈవో సురేష్‌కుమార్‌రెడ్డి పర్యవేక్షణలో హుండీల ఆదాయాన్ని లెక్కించారు. ఆలయంలోని శాశ్వత హుండీల ద్వారా రూ.47,37,791, అన్నప్రసాద వితరణ సత్రంలోని హుండీ ద్వారా రూ.52,343 కలిపి పై మొత్తం వచ్చిందని సహాయ కమిషనర్ తెలిపారు. అలాగే మిక్స్‌డ్ బంగారు, వెండి ఆభరణాలు, 11 కువైట్ కాయిన్స్ వచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెంకటస్వామి, ప్రధాన, ఉప ప్రధాన, ముఖ్య అర్చకులు కేసరి, రాజారమేష్, రాజగోపాలాచార్యులు, ఆర్కే వ్యాలీ ఏఎస్‌ఐ నాగరాజు, పోలీసులు, చక్రాయపేట ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు సిబ్బంది, ఆలయ సిబ్బంది, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.
‘పప్పులో బల్లి’ కేసులో ఒకరి అరెస్ట్
మైదుకూరు : మైదుకూరు మండలం జీవీ సత్రంలోని స్మార్ట్ కిచెన్‌లో వండిన పప్పులో బల్లి పడిన సంఘటనలో ఒకరిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. జీవీ సత్రం హైస్కూల్‌లో పిల్లలకు భోజనం వడ్డించే పూర్వ వంట ఏజెన్సీ సభ్యులు చంద్ర, లీలావతి, మరో ఇద్దరిపై ఎంఈఓ–2 నరహరి శర్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఇందులో సోమవారం చంద్రను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్టు తెలిపారు. మిగిలిన ముగ్గురిని విచారణ చేస్తున్నట్టు చెప్పారు.


