ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో ఈ నెల 11న అంకురార్పణతో ప్రారంభమైన పవిత్రోత్సవాలు సోమవారం ముగిశాయి. మూడు రోజులుగా యాగశాలలో వేదపండితులు హోమాలు నిర్వహించారు. చివరిరోజు సోమవారం విష్వక్సేన ఆరాధన, పుణ్యహవచనం, అగ్ని ప్రతిష్ఠ, పవిత్ర దేవతా హోమం, శాంతి హోమం, మహా పుర్ణాహుతి, కుంభ ప్రోక్షణ, పవిత్ర వితరణ, మహా మంగళహారతి తదితర పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారు స్వామి, అమ్మవారిని దర్శించుకుని తరించారు.
ఇద్దరిపై చీటింగ్ కేసు
కడప అర్బన్ : కడప నగరంలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నివసిస్తున్న గౌస్ బాషా అనే వ్యక్తి, రైతులతో కలిసి చేసిన ఫిర్యాదుతో మధ్యప్రదేశ్‌లో ఉంటున్న బన్వర్లాల్, విష్ణు భాయ్‌పై అక్కడే కేసు నమోదు అయింది. ఆ కేసును మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పోలీసులు కడప వన్‌టౌన్‌కు బదిలీ చేశారు. గౌస్ బాషా రైతుల దగ్గర నుంచి సేకరించిన పొగాకును మధ్యప్రదేశ్‌కు తీసుకెళ్లి దాదాపు 20 లక్షల రూపాయలకు విక్రయించాడు. అక్కడ వ్యాపారులు, ఈ కేసులో నిందితులైన ఇద్దరు.. గౌస్‌బాషాకు కేవలం 3 లక్షలు మాత్రమే ఇచ్చారు. మిగిలిన 17 లక్షలు పెండింగ్‌లో ఉంచారు. దీంతో గౌస్ బాషా బాధిత రైతులను మధ్యప్రదేశ్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. సదరు కేసును మధ్యప్రదేశ్ పోలీసులు కడప వన్ టౌన్‌కు బదిలీ చేశారు. కడప వన్ టౌన్ సీఐ తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు.


