బుడ్డాకు నిబంధనలు... ఆడబిడ్డకు మినహాయింపులా? | - | Sakshi
Sakshi News home page

బుడ్డాకు నిబంధనలు... ఆడబిడ్డకు మినహాయింపులా?

Sep 16 2026 3:37 AM | Updated on Sep 16 2026 3:37 AM

●అధికారులు స్పష్టత ఇవ్వాలి

సాక్షి ప్రతినిధి కడప : ‘బుడ్డా వెంగళరెడ్డి ఇంటి ఆడబిడ్డను నేను’ కడపలో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడు వేదికపై ఎమ్మెల్యే మాధవీరెడ్డి చెప్పిన ఈ మాట బాగా ప్రాచుర్యం పొందింది. అదే బుడ్డా వెంగళరెడ్డి విగ్రహ నిర్మాణానికి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కేటాయించిన స్థలంలో ఎమ్మెల్యే తన మామ అయిన మాజీమంత్రి రాజగోపాల్‌రెడ్డి విగ్రహ ఏర్పాటు కోసం నిర్మాణాలు చేపట్టడం వివాదానికి దారి తీస్తోంది. ఎమ్మెల్యే, ఆమె భర్త శ్రీనివాసులురెడ్డి తీరుపై పలువురు చరిత్రకారులు మండిపడుతున్నారు. అధికార దర్పంతో నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణం చేపడుతున్నప్పటికీ మున్సిపల్‌ కమిషనర్‌తోపాటు సంబంధిత అధికారులు చేష్టలుడి చూస్తుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన బుడ్డా వెంగళరెడ్డి 1866 నాటి డొక్కల కరువు సమయంలో వేలాది మంది ప్రజలకు అంబలి పోసి ప్రాణాలు కాపాడారు. విషయం తెలుసుకున్న విక్టోరియా మహారాణి ఆయన్ను మద్రాసుకు పిలిపించి ఘనంగా సత్కరించి బంగారు పతకాన్ని బహూకరించారు. రాయలసీమ చరిత్రలో దాతృత్వానికి చిరునామాగా నిలిచిన మహాదాత బుడ్డా వెంగళరెడ్డి, త్యాగానికి ప్రతీక అయిన తొలి స్వాతంత్య్ర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాలను కడప నగరంలో ఏర్పాటు చేయాలని వివిధ పార్టీలు, సంఘాల నాయకులు నిర్ణయించారు. వీరి అభ్యర్థన మేరకు అప్పటి నగర మేయర్‌ కె.సురేష్‌బాబు హయాంలో ఒకసారి, పాకా సురేష్‌కుమార్‌ హయాంలో మరోసారి మున్సిపల్‌ కార్పొరేషన్‌ జనరల్‌ బాడీ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. రైతు బజారు కూడలి వద్ద బుడ్డా వెంగళరెడ్డి, ఐటీఐ సర్కిల్‌ వద్ద ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాల ఏర్పాటుకు కార్పొరేషన్‌ పచ్చజెండా ఊపింది.

అప్పుడు నిబంధనలు....ఇప్పుడు?

రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ, ఇంటాక్‌, రెడ్డి సేవా సమితి, లోక్‌సత్తా, ఏపీ రెడ్డి సంఘం, మానవత, ఏపీ దళితమిత్ర తదితర పార్టీలు, సంఘాలకు చెందిన నాయకులు గతంలో ఎమ్మెల్యే, ఆమె భర్త శ్రీనివాసులురెడ్డిని కలిసి సహకరించాలని కోరారు. భూమి పూజ కూడా వారి చేతుల మీదుగానే నిర్వహించాలని కోరారు. సుప్రీం కోర్టు నిబంధనలు ఉన్నందువల్ల తాము హాజరు కాలేమని, మీరు ఏర్పాట్లు చేసుకుంటే అధికారుల నుంచి అభ్యంతరాలు రాకుండా కలెక్టర్‌తో తాను మాట్లాడుతానని టీడీపీ నేత శ్రీనివాసులురెడ్డి అప్పట్లో హామీ కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు అదే ప్రాంతంలో ఆయన తండ్రి, దివంగత మాజీ మంత్రి రాజగోపాల్‌రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు పనులు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. బుడ్డా విగ్రహ ఏర్పాటుకు సుప్రీంకోర్టు నిబంధనలు అడ్డంకి అయితే, ఇప్పుడు రాజగోపాల్‌రెడ్డి విగ్రహానికి అవి వర్తించవా? అనే ప్రశ్న ఉదయిస్తోంది.

మాటల్లో ఒకటి.. చేతల్లో మరొకటా..?!

ఎమ్మెల్యే మాధవీరెడ్డి మహానాడు సభలో మాట్లాడుతూ తాను బుడ్డా వెంగళరెడ్డి ఇంటి ఆడబిడ్డనని చెప్పుకుని ఇప్పుడు బుడ్డా విగ్రహం ఏర్పాటుకు కేటాయించిన స్థలంలో తన మామ విగ్రహం ఏర్పాటు చేయిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. మాటల్లో బుడ్డా వారసత్వంపై గౌరవం, ఆచరణలో మాత్రం భిన్నంగా వ్యవహారించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇది ఆమె ద్వంద్వ వైఖరికి నిదర్శనమని పలువురు వాపోతున్నారు. బుడ్డా పట్ల ప్రజల్లో ఉన్న అపార గౌరవాన్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకోవడానికే మహానాడు సభలో ఎమ్మెల్యే అలా మాట్లాడారు తప్ప చిత్తశుద్దితో కాదని అంటున్నారు. ఒక మహాదాత పట్ల కుటుంబ అనుబంధాన్ని ప్రకటించడం ఒక అంశమైతే, ఆయన చరిత్రను ప్రజల మధ్య చిరస్థాయిగా నిలబెట్టేందుకు కృషి చేయకపోవడం మరో అంశమని పరిశీలకులు వెల్లడిస్తున్నారు.

కడపలోనే ఎందుకు?

ఉమ్మడి జిల్లాలో మంత్రిగా పనిచేసిన లక్కిరెడ్డిపల్లె రాజగోపాల్‌రెడ్డి విగ్రహం ఏర్పాటుపై ఎవరికీ అభ్యంతరాలు ఉండాల్సిన పని లేదు. అయితే, ఆయన ప్రాతినిద్యం వహించిన లక్కిరెడ్డిపల్లెలో ఏర్పాటు చేయడం సముచితంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కడప నగరానికి ఆయన చేసిన ప్రత్యేక సేవలు ఏమిటి? ఆయన ప్రాతినిధ్యం వహించిన ప్రాంతంలో విగ్రహం లేకపోయినా కడప నగరంలోనే ఎందుకు? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కడపతో చారిత్రక, సామాజిక అనుబంధం ఉన్న వెంగళరెడ్డి విగ్రహం కోసం ఇప్పటికే మున్సిపల్‌ కార్పొరేషన్‌ తీర్మానం ఉన్నప్పటికీ దాన్ని పక్కకు నెట్టి మరో విగ్రహానికి ప్రాధాన్యత ఇవ్వడం సమంజసమేనా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

కడప రైతు బజారు కూడలిలో మహాదాత విగ్రహ ఏర్పాటుకు కార్పొరేషన్‌ తీర్మానం

ప్రస్తుతం అదే ప్రాంతంలో మాజీ మంత్రి రాజగోపాల్‌రెడ్డి విగ్రహ నిర్మాణ పనులు

అధికారం ఉందని నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నిర్మాణం

చోద్యం చూస్తున్న అధికారులు

బుడ్డా విగ్రహ ఏర్పాటుకు మున్సిపల్‌ కార్పొరేషన్‌ తీర్మానం ఉన్నప్పటికీ, ఆ స్థానంలో ఎలాంటి అనుమతులు లేకుండా మరో విగ్రహం ఏర్పాటు చేస్తుంటే అధికారులు ఎందుకు నిలువరించడం లేదు? ప్రస్తుతం జరుగుతున్న విగ్రహ నిర్మాణ పనులకు ఏ నిబంధనల ప్రకారం అనుమతి లభించింది? అనే ప్రశ్నలకు మున్సిపల్‌, సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. పబ్లిక్‌ స్థలాల్లో విగ్రహాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలు ఏమైనా ఉంటే అవి అందరికీ ఒకే విధంగా వర్తించాలి. ఒకరి విషయంలో నిబంధనలు చూపించి, మరొకరి విషయంలో పక్కన పెడితే ప్రజల్లో పలు సందేహాలు తలెత్తడం సహజం. అధికారుల ఉదాసీన వైఖరి వల్లే వివాదాలు తలెత్తుతున్నాయని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఇప్పటికై నా మహానీయులకు విగ్రహాల ఏర్పాటుకు తీర్మానం చేసిన స్థలాలను పరిరక్షించాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement