ఆక్సిజన్‌ కరువు! | - | Sakshi
Sakshi News home page

ఆక్సిజన్‌ కరువు!

Sep 16 2026 3:37 AM | Updated on Sep 16 2026 3:37 AM

ప్రాణం పోసే ప్లాంట్‌కు

జమ్మలమడుగు : కరోనా కష్టకాలంలో వందలాది మంది ప్రాణాలు కాపాడేందుకు భారీ ఖర్చుతో ఏర్పాటు చేసిన లక్షలాది రూపాయల విలువైన ఆక్సిజన్‌ ప్లాంట్‌..అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వాల సమన్వయ లోపంతో ఐదేళ్లుగా మూలనపడి తుప్పుపడుతోంది. జమ్మలమడుగు ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో రూ.70 నుంచి రూ.80 లక్షల భారీ వ్యయంతో నిర్మించిన ఈ ప్లాంట్‌ నేటికీ రన్నింగ్‌లోకి రాకపోవడంపై స్థానికులు, రోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

2021 నుండి రేకుల షెడ్డుకే పరిమితం

ప్రపంచాన్ని వణికించిన కరోనా సమయంలో ఆక్సిజన్‌ అందక ఎక్కువ మంది రోగులు మరణించడంతో పాటు ఆక్సిజన్‌ సిలిండర్ల కొరత తీవ్రంగా ఏర్పడింది. ఈ దుస్థితిని నివారించేందుకు 2021లో జమ్మలమడుగు ప్రభుత్వాసుపత్రి వెనుక వైపు అత్యవసరంగా ఒక రేకుల షెడ్డును నిర్మించి ఈ ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. అయితే, సెకండ్‌ వేవ్‌ ముగిసి కరోనా తీవ్రత తగ్గిపోవడంతో అధికారులు ఈ ప్లాంట్‌ ఉనికినే పూర్తిగా మర్చిపోయారు. ప్లాంట్‌ నిర్వహణ కొరకు కేంద్ర ప్రభుత్వం నుండి తుది అనుమతులు రాలేదనే సాకుతో దీనిని ఎవరూ పట్టించుకోవడం లేదు.

ఏడాదికి రూ. లక్షకు పైగా సిలిండర్ల భారం

ప్లాంట్‌ అందుబాటులో లేకపోవడంతో ఆసుపత్రిలో రోగులకు అత్యవసర సేవలు అందించేందుకు వైద్యాధికారులు బయటి నుంచి ఆక్సిజన్‌ సిలిండర్లను కొనుగోలు చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం ఆసుపత్రిలో నెలకు సగటున 30 ఆక్సిజన్‌ సిలిండర్లను ఉపయోగిస్తున్నారు. ఒక్కో సిలిండర్‌కు రూ. 300 చొప్పున వైద్యాధికారులు చెల్లిస్తుండటంతో.. ప్రతినెలా రూ. 10 వేల వరకు కేవలం సిలిండర్ల కోసమే ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ లెక్కన ఏడాదికి రూ. లక్షకు పైగా ఆక్సిజన్‌ కొనుగోళ్లకే సరిపోతోంది.

కరోనా వేళ ప్రాణదాత.. ఇపుడు మూలనపడ్డ వైనం

నెలకు రూ.10 వేల సిలిండర్ల ఖర్చు.. ప్రజాధనం వృథా

2021లో జమ్మలమడుగు ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు

సెకండ్‌ వేవ్‌ తర్వాత

గాలికొదిలేసిన అధికారులు

మెయింటెనెన్స్‌ తక్కువ.. ప్రయోజనం ఎక్కువ

ఆక్సిజన్‌ ప్లాంట్‌ను రన్నింగ్‌లోకి తీసుకువచ్చి నడిపితే దానికి అయ్యే నిర్వహణ ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. బయటి నుంచి కొనుగోలు చేసే సిలిండర్ల ఖర్చుతో పోలిస్తే ప్లాంట్‌ నిర్వహణ చాలా చౌక. ప్లాంట్‌ను ప్రారంభిస్తే ఆసుపత్రిలోని అత్యవసర విభాగాలకు, శ్వాసకోశ సమస్యలతో వచ్చే రోగులకు నిరంతరాయంగా ఉచిత ఆక్సిజన్‌ అందడమే కాకుండా, ఆసుపత్రికి ఆర్థికంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. – రఫిక్‌ పాషా, సూపరిండెంటెంట్‌, జమ్మలమడుగు ఆసుపత్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement