● ఎన్‌ఎంఎంస్‌కు దరఖాస్తుకు వేళాయె
● అన్ని ప్రభుత్వ యాజమాన్యాల్లో 8వ తరగతి విద్యార్థులు అర్హులు
కడప ఎడ్యుకేషన్ : ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ప్రతిభ గల పేద విద్యార్థుల చదువుకు ఆర్థిక బరోసా కల్పించేందుకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్(ఎన్‌ఎంఎంఎస్)ను అందచేస్తోంది. ఇందు కోసం ప్రతి ఏటా ఎన్‌ఎంఎంఎస్ పరీక్షను నిర్వహిస్తోంది. ఇందులో ప్రతిభ చాటిన విద్యార్థులకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఉపకారవేతనాన్ని అందజేస్తోంది. ఈ ఉపకార వేతనం 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ పూర్తయ్యేంత వరకు ఏటా రూ.12 వేల చొప్పన నాలుగేళ్లపాటు రూ.48 వేలు ఆర్థిక ప్రోత్సాహం లభిస్తుంది. పభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేదలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పరీక్షను ఎక్కవ మంది రాసేలా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 12వ తేదీ వరకు గడువు ప్రకటించింది. జిల్లాలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు.
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం..
ఎన్‌ఎంఎంఎస్ ఉపకార వేతనాల పరీక్షకు సంబంధించి దరఖాస్తుల పక్రియ ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రారంభమైయింది. అర్హులైన 8వ తరగతి విద్యార్థులు www.bse.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించాలి. ఇందుకు సంబంధించి ఆక్టోబర్ 12తేదీ చివరి గడువుగా నిర్థారించింది. పరీక్ష నవంబర్ 15న పరీక్ష ఉంటుంది, ప్రతి విద్యార్థి పరీక్ష ఫీజు కింద ఓసీ, బీసీ విద్యార్థులయితే రూ.100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.50లను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. బీఎస్సీ, ఏపీ. జీవోవీ.ఇన్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులో ఎస్‌బీఐ కలెక్ట్ ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుది.
ఈ అర్హతలు తప్పనిసరి..
జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, మున్సిపల్, ఎయిడెడ్ ప్రాథమికోన్నత పాఠశాలలు, వసతి సౌకర్యం లేని ఏపీ ఆదర్శ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ ప్రోత్సహకాలకు అర్హులు. ఏడో తరగతి పరీక్షల్లో జనరల్ విద్యార్థులు కనీసం 55 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. తల్లితండ్రుల వార్షిక ఆదాయం ఏడాదికి రూ. 3,50,000 మించకూడదు. ఎన్‌ఎంఎంఎస్ రాత పరీక్ష ద్వారా విద్యార్థులనుస్కాలర్‌షిప్‌లకు ఎంపిక చేస్తారు.
పరీక్షా విధానం ఇలా..
అర్హులైన విద్యార్థులకు రాష్ట్రస్థాయిలో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష రెండు విభాగాలుగా మొత్తం 180 మార్కులకు అబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. మొత్తం 180 బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. ప్రతి విభాగానికి 90 నిమిషాల చొప్పున మొత్తం 3 గంటలు పరీక్ష ఉంటుంది, ఇందులో మెంటల్ ఎబిలిటీ టెస్టు(మ్యాట్) 90 పశ్నలు 90 మార్కులకు, స్కాలాస్టిక్ అప్టిట్యూడ్ టెస్టు(శాట్) 90 ప్రశ్నలు 90 మార్కులకు ఉంటాయి, ఇలా రెండు పేపర్లు కలిసి 180 మార్కులు ఉంటాయి. 7, 8వ తరగతి సిలబస్ నుంచి గణితం(20 మార్కులు), సైన్స్(35 మార్కులు), సోషల్ స్టడీస్ (35 మార్కులు) నుంచి ప్రశ్నలు వస్తాయి. పరీక్ష తయారీ కోసం మునుపటి సంవత్సరాల మోడల్ పేపర్లను టెస్ట్‌బుక్ ద్వారా డౌన్‌లోడు చేసుకుని ప్రాక్టీస్ చేసుకోవచ్చు.
పేద విద్యార్థులకు చక్కటి అవకాశం..
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎనన్‌ఎంఎంఎస్ పరీక్ష పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. 8వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువడానికి ఉపయుక్తంగా ఉంటుంది. విద్యార్థులు బాగా చదువుకుని పరీక్షలో ప్రతిభ చూపితే నాలుగేళ్లపాటు అర్థిక వెసులుబాటు ఉంటుంది. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.
– షేక్ షంషుద్దీన్, జిల్లా విద్యాశాఖ అధికారి


