● పలువురికి గాయాలు
కమలాపురం : మండల శివారు గ్రామమైన ఎర్రబల్లె కొత్తపల్లెలో స్థల వివాదంలో ఘర్షణ చోటు చేసుకుంది. కర్రలతో కొట్టుకోవడంతో ఇరు వర్గాల వారికి గాయాలయ్యాయి. పోలీసుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎర్రబల్లె కొత్తపల్లె గ్రామంలో గతంలో ఎస్సీలకు కొండ పొరంబోకు స్థలంలో ఇళ్ల పట్టాలిచ్చారు. అందులో కొందరు గృహాలు కూడా నిర్మించుకున్నారు. ఆ స్థలం పక్కనే 1.50 ఎకరాల ఖాళీ స్థలం ఉంది. ఈ స్థలం కూడా తమకే కేటాయించాలని ఎస్సీలు, ఆ స్థలం వారికి సంబంధం లేదని ఇతరులు కొంత కాలంగా ఘర్షణ పడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఆ ఖాళీ స్థలంలో ఎస్సీలు బాత్‌రూం నిర్మాణం చేపట్టారు. దీంతో ఇతరులు వచ్చి ఈ స్థలంలో మీకు హక్కు లేదని, వాగ్వివాదానికి దిగారు. మాటకుమాట పెరిగి కర్రలతో కొట్టుకున్నారు. ఈ ఘటనలో దేవరాజు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అలాగే అదే వర్గానికి చెందిన బాల నరసింహులు, ఓబులేసు, అజయ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. మరో వర్గానికి చెందిన ప్రతాప్‌రెడ్డి కుమారుడు సుబ్బారెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డికి స్వల్పగాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం 108 వాహనంలో రిమ్స్‌కు తరలించారు. పరస్పర ఫిర్యాదుల మేరకు ఇరు వర్గాల వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


