ఒంటిమిట్ట : ఏకశిలానగరిలోని కోదండ రామాలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం రఘురాముడికి ఉత్సవ నిర్వాహకులు పవిత్రమాలలను భక్తి శ్రద్ధలతో సమర్పించారు. సీతారామలక్ష్మణ మూర్తులను పట్టువస్త్రాలు, ఆభరణాలతో సుందరంగా అలంకరించారు. యాగశాలలో విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, అగ్ని ప్రతిష్ట, పవిత్ర దేవతా హోమం, పంచసూక్త పరివార హరణం, పవిత్ర సమర్పణ, లఘు పుర్ణాహుతి, చతుర్వేద స్వసి, తీర్థప్రసాద వినియోగం, వితరణ పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. సీతారామలక్ష్మణ మూర్తులు, ద్వార పాలకులు, ధ్వజస్తంభం, బలిపీఠం, గర్భగుడి గోపురం, భక్త సంజీవరాయస్వామికి పవిత్ర మాలలతో అలంకరణ చేశారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భక్తులు రామయ్యను దర్శించుకున్నారు. సోమవారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మహోపూర్ణాహుతి, కుంభ ప్రోక్షణ, పవిత్ర వితరణతో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. అదే రోజు సాయంత్రం 5 గంటల నుండి స్వామి వారి ప్రాకారోత్సవం ఉంటుంది.
గండిని గాడిలో పెడతాం
చక్రాయపేట : గండి దేవస్థానాన్ని గాడిలో పెట్టేందుకు తాను వెనుకాడనని ఆలయ సహాయ కమిషనర్ విశ్వనాథ్ పేర్కొన్నారు. గండి దేవస్థానంలో పూజలు, వాహన పూజల్లోనూ,టికెట్ కాకుండా అదనపు వసూళ్లు హారతి పళ్లెం కానుకలు, కొబ్బరికాయలు,పూల మాలలు అధిక దరలకు విక్రయిస్తున్నట్లు,ప్రైవేట్ వ్యక్తుల పెత్తనం, భక్తుల మనో భావాలు దెబ్బతినేలా ప్రవర్తించడం, తదితర విషయాలపై ఆదివారం ’సాక్షి’లో గాడితప్పిన గండి శీర్షికతో కథనం ప్రచురితమైంది.దీనిపై ఆలయ సహాయ కమిషనర్ విశ్వనాథ్ స్పందించారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా వారి మనోభావాలు దెబ్బతీసేలా ఎవరు ప్రవర్తించినా, కొబ్బరి కాయలు, పూల మాలలు అధిక ధరలకు విక్రయించినా వెంటనే వారిపై ఉన్నతాధికారులకు నివేదిక పంపి తక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పారు. పత్రికలో వచ్చిన అన్ని అంశాలకు సంబంధించి బాధ్యులైన వారికి మెమోలు కూడా ఇస్తామని చెప్పారు. భక్తులు కూడా ఏసమస్య ఎదురైనా తనకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేయాలని చెప్పారు.
నేటి పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు ఉండవు
కడప సిటీ : వినాయక చవితి పండుగ సందర్భంగా సోమవారం ప్రభుత్వ సెలవు దినం కావడంతో జిల్లా వ్యాప్తంగా పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు ఉండవని జిల్లా రెవెన్యూ అధికారి మల్లికార్జునుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని రెవెన్యూ డివిజన్, మండల రెవెన్యూ కార్యాలయాలతో పాటు జిల్లా కలెక్టరేట్‌లో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్‌ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు ఉండవన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి, అర్జీలు సమర్పించేందుకు సోమవారం కలెక్టరేట్‌కు రావద్దని జిల్లా రెవెన్యూ అధికారి సూచించారు.
ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక ఉపాధ్యాయ సేవా కేంద్రంలో ఆదివారం రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలను ఘనంగా సన్మానించారు. రామేశ్వరంలోని ఎస్‌పీసీఎన్ మున్సిపల్ హైస్కూల్‌లో తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న జి.గంగాధర్ నాయుడు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, ఎర్రగుంట్ల బాలుర ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు బత్తల వెంకట ప్రసాద్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న సందర్భంగా వారికి శాలువాలు, పూలమాలలు వేసి సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత డీకే చదువుల బాబు, ఉపాధ్యా సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యుడు డాక్టర్ టీడీ వరుణ్‌కుమార్‌రెడ్డి, భోగా గంగాధర్‌రెడ్డి, అవార్టీ టీచర్స్ అసోసియేషన్ నాయకుడు రమణయ్య, ఆర్‌సీపీఈ కళాశాల ప్రిన్సిపాల్ రవిశంకర్, వ్యాయామ అధ్యాపకులు పంజగల మధుసూదన్ బాబు, కూరపాటి శ్రీనివాసులరెడ్డి, మాధవరెడ్డి, ఉపాధ్యాయులు రమణ, ప్రధానోపాధ్యాయుడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


