కడప రూరల్ : బద్వేలు మడకలవారిపల్లె గ్రామ పరిధిలో జరుగుతున్న భారీ భూ కుంభకోణంపై చర్యలు తీసుకోవాలని భూ పోరాట సాధన సమితి జిల్లా కన్వీనర్ బి. నారాయణరెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక ఆ సంస్థ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బద్వేలు మడకలవారిపల్లిలో 2.34 ఎకరాల అత్యంత విలువైన ప్రభుత్వ భూమి ఉందన్నారు. ఈ స్థలాన్ని కబ్జా చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మొత్తం 2.34 ఎకరాల స్థలంలో న్యాయస్థానం పరిధిలో ఉన్న 60 సెంట్ల స్థలం మినహాయించి, మిగతా స్థలం ఆక్రమణకు గురి కాకుండా చూడాలన్నారు. ఈ అంశంపై స్థానిక అధికారులతోపాటు జిల్లా కలెక్టర్ ఇతర అధికారులకు ఇప్పటికే ఫిర్యాదు చేశామన్నారు. ఈ విలువైన స్థలం కాపాడకపోతే ఆందోళన కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో అఖిలపక్ష కమిటీ జిల్లా అధ్యక్షులు సీఆర్‌వీ ప్రసాద్‌రావు, బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు గుర్రప్ప, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక జిల్లా కార్యదర్శి సీఎస్ ఆంజనేయులు, డాక్టర్ పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.


