కడప సిటీ: జిల్ల్లాలో తల్లి మరణాలను పూర్తిస్థాయిలో నివారించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పరస్పర సమన్వయంతో పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన ‘తల్లి మరణాల పర్యవేక్షణ మరియు స్పందన’ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత ఐదు నెలల్లో జిల్లాలో సంభవించిన మాతృ మరణాల వివరాలు, వాటికి దారితీసిన పరిస్థితులు, గర్భిణులకు అందుతున్న సేవలు మరియు హైరిస్క్ గర్భిణుల గుర్తింపు–చికిత్స తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.మాతృ మరణాలకు దారితీసిన కారణాలను లోతుగా విశ్లేషించి, భవిష్యత్తులో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన నివారణ చర్యలు చేపట్టాలన్నారు. క్షేత్రస్థాయిలో ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది గర్భిణులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యాధికారుల దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవ సేవలు, అత్యవసర వైద్య సదుపాయాలు, రక్తం నిల్వలు, మందులు నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి మల్లికార్జున, ఐసీడీఎస్ పీడీ రమాదేవి, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ రఫీక్ భాష, ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్, రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలయ్య, అదనపు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ రవిబాబు, గైనకాలజిస్ట్ రేఖా రావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
కుష్టు వ్యాధిపై వాల్ పోస్టర్ ఆవిష్కరణ
కడప సెవెన్‌రోడ్స్: జిల్లాలో జాతీయ కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ప్రచార కార్యక్రమానికి సంబంధించిన అవగాహన వాల్ పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి బుధవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సెప్టెంబరు 11 నుండి 24 వరకు 14 రోజుల పాటు జరిగే ఈ క్యాంపెయిన్‌ను వైద్య, మున్సిపల్ శాఖలు సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. ఆరోగ్య కార్యకర్తలు బృందాలుగా ఏర్పడి ప్రతి ఇంటినీ జల్లెడ పట్టి 100 శాతం పక్కాగా సర్వే చేయాలని, ఏ ఒక్క కేసూ విస్మరణకు గురికాకూడదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి మల్లికార్జునుడు, కమిటీ కో–చైర్మన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి.యుగంధర్, మెంబర్ సెక్రటరీ జిల్లా కుష్టు వ్యాధి నియంత్రణ అధికారి డాక్టర్ రవిబాబు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలయ్య, డీసీహెచ్‌ఎస్ ఇంచార్జి అధికారి రఫీక్ బాషా, వివిధ శాఖల కమిటీ సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సమీక్షా సమావేశంలో
అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం


