● కానిస్టేబుల్, ఎస్‌ఐ ఖాళీలను
11,000కు పెంచాలని డిమాండ్
● వయోపరిమితిని 35 ఏళ్లకు
సడలించాలని కలెక్టరేట్‌లో వినతి
కడప అర్బన్: రాబోయే జాబ్ క్యాలెండర్‌లో పోలీస్ కానిస్టేబుల్ పోస్టులను కేవలం 2,000 మాత్రమే భర్తీ చేస్తామనడం అభ్యర్థులను తీవ్ర నిరాశకు గురిచేసిందని ఏపీ విద్యార్థి, నిరుద్యోగ, యువజన జేఏసీ మండిపడింది. ఈ నిర్ణయానికి నిరసనగా బుధవారం కడప మహావీర్ సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా అధ్యక్షుడు ఉబ్బరపు అబెల్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల మంది నిరుద్యోగులు పోలీస్ ఉద్యోగాల కోసం శ్రమిస్తున్నారని తెలిపారు. సిబ్బంది కొరత దృష్ట్యా 11,000 పోస్టులు భర్తీ చేయాలని గతంలో డీజీపీ ప్రభుత్వానికి లేఖ రాసిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ మేరకు కానిస్టేబుల్, ఎస్‌ఐ పోస్టులను 11,000కు పెంచి, అభ్యర్థుల వయోపరిమితిని 35 ఏళ్లకు సడలించాలని డిమాండ్ చేశారు. రెండు నెలలుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున నిరుద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.


