సోలార్ కంపెనీ వస్తే ఉపాధి, ఉద్యోగావకాశాలు వస్తాయని భూములు ఇచ్చిన రైతులు ఆనందపడ్డారు. తీరా చూస్తే ఉద్యోగాలు లేవు. పైగా ఇచ్చిన ఉద్యోగాలు కసువు ఎత్తడం లాంటివి. ఎక్కడ నుంచో వచ్చిన వారికి ఏసీ గదుల్లో కూర్చొనే ఉద్యోగావకాశాలు కల్పించారంటూ భూములిచ్చిన రైతులు నిరసనకు దిగారు. పరిహారం కూడా ఇవ్వకుండా మోసం చేస్తారా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక నాయకుల మాటలు విని మోసపోయాం అంటూ మండిపడుతున్నారు.
జమ్మలమడుగు : సోలార్ కంపెనీకి భూములు ఇచ్చిన రైతులు బుధవారం ఆందోళనకు దిగారు. వివరాలు ఇలా ఉన్నాయి.
సేల్ కంపెనీ యాజమాన్యం భూమి లీజుకు తీసుకోవటానికి, భూములు అమ్మకం చేసే రైతుల వద్ద నుంచి భూములు కొనుగోలు చేయటానికి భూసేకరణ టీంను ఏర్పాటు చేసుకుంది. ప్రస్తుతం భూసేకరణ పూర్తి చేసుకుని మొత్తం భూముల్లో సోలార్ ప్యానల్స్ బిగించుకున్నారు. రైతుల భూములను సేకరించుకున్న పరిశ్రమ యాజమాన్యం మొత్తం భూముల చుట్టూ ఫెన్సింగ్ చేసుకుని తమ పనులు చేసుకుంటున్నారు. పరిశ్రమ వద్దకు వెళ్లి తమ వారికి ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరితే అది మాకు సంబంధం లేదంటూ పరిపాలనకు సంబంధించిన సెక్టార్‌లో చెబుతున్నారు. భూములు సేకరించిన టీంను ప్రశ్నిస్తే తాము భూములను సేకరించేవారమే తప్ప ఉద్యోగాలు ఇవ్వడం మా చేతిలో లేదంటూ ఒకరిపై ఒకరు చెప్పుకువస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పగుల గొడితేనే వారు వస్తారని మా నాయకులు అంటున్నారు..
పనిపూర్తి అయిన తర్వాత తమ బాధలను సేల్ కంపెనీ పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. గట్టిగా ప్రశ్నిస్తే జమ్మలమడుగు నుంచి మా ఆఫీసర్ వస్తాడు తర్వాత మాట్లాడుకోండి..అని అంటున్నారని , ఆ అధికారి ఏసీ రూముల్లో కూర్చొని తమ గురించి పట్టించుకోవడం లేదన్నారు. ఈ విషయాన్ని తమ గ్రామ నాయకులను చెప్పి న్యాయం చేయాలని అడిగితే సేల్ కంపెనీ యాజమాన్యానికి మా ఎమ్మెల్యే అన్నా కూడా లెక్కలేకుండాపోయిందని.. ముందు మీరు కంపెనీ ఫెన్సింగ్ పగులగొట్టండి తర్వాత యాజమాన్యం వారు వస్తారు.. అప్పుడు మాట్లాడదాం అని చెబుతున్నారని రైతులు అంటున్నారు. సేల్ కంపెనీ భూములను లీజుకు తీసుకున్న రైతులకు పరిహారం ఇవ్వడంలేదు. పరిహారంకు సంబంధించిన చెక్కులు ఇచ్చారు. అవి బౌన్స్ అయిపోయాయని .. మా పరిస్థితి ఏంటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ధర్నాకు సిద్ధమైన రైతులు..
సేల్ కంపెనీ చేపట్టిన సోలార్ పవర్ ప్రాజెక్టుకు పెద్దముడియం మండలం కల్వటాల, పాపాయపల్లె, నంద్యాల జిల్లాకు సంబంధించిన గోవిందపల్లె గ్రామాల రైతులు భూములు ఇచ్చారు. వారికి న్యాయం జరగకపోవడంతో బుధవారం రైతులు సేల్ కంపెనీ వద్దకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. సేల్ కంపెనీ రైతుల సమస్యలను పట్టించుకునే వరకు ఆందోళన చేస్తామని పిలుపునిచ్చారు. సేల్ కంపెనీ రైతుల వద్దనుంచి బలవంతంగా భూసేకరణ చేసి మోసం చేస్తోందంటూ అప్పట్లో ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి రైతుల వద్దకు వెళ్లి అవగాహన కల్పించారు. అప్పుడు కూటమి నాయకులు అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారంటూ అసత్య ప్రచారం చేశారు. ఇప్పుడు కూటమి నాయకులే ముందుకు వచ్చి సేల్ కంపెనీ చేస్తున్న మోసాలు తెలుసుకుని ఇప్పుడు ధర్నాకు సన్నద్ధం అవుతున్నారు.


