మైదుకూరు : తమ భూమిని ట్రాక్టర్‌తో దున్నుతుండగా డయాన్‌ఖాన్‌పల్లెకు చెందిన ఇరగంరెడ్డి రామిరెడ్డి, అతని కుమారుడు తమపై దాడి చేశారని మైదుకూరు మండలం ముత్తరాయపల్లె ఎస్సీ కాలనీకి చెందిన కొండూరు మునెయ్య పోలీసుకు ఫిర్యాదు చేశారు. బాధితుడి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కొండూరు మునెయ్య భూమి గురించి రామిరెడ్డి కొన్నేళ్లుగా గొడవపడేవారు. మునెయ్య తహసీల్దార్‌కు విన్నవించుకోగా ఆయన రికార్డులను పరిశీలించి సాగు చేసుకోమని చెప్పారు. ఆ మేరకు గురువారం మునెయ్య, ఆయన కుమారుడు గంగరాజు ట్రాక్టర్‌ను పిలిపించి పొలాన్ని దున్నిస్తుండగా రామిరెడ్డి, ఆయన కుమారుడు నాగిరెడ్డి అక్కడకు చేరుకొని కులం పేరుతో దూషిస్తూ దుర్భాషలాడారు. అంతటితో ఆగకుండా దాడి చేసి రాళ్లతో కొట్టారు. మునెయ్య తలకు రక్తగాయాలయ్యాయి. అతన్ని 108 అంబులెన్స్‌లో ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మునెయ్య ఫిర్యాదు మేరకు దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.


