● రూ.50 లక్షలకు కుచ్చుటోపీ
● నిందితుడి అరెస్టు
కడప అర్బన్ : ట్రేడింగ్, వ్యాపార సంస్థల్లో పెట్టుబడులు పెడితే తక్కువ కాలంలో అధిక లాభాలు అందిస్తానంటూ నమ్మించి రూ.50 లక్షలు వసూలు చేసి మోసానికి పాల్పడిన వ్యక్తిని కడప వన్‌టౌన్ సీఐ తిమ్మారెడ్డి, ఎస్‌ఐ అమర్నాథ్ రెడ్డి, పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిపై గతంలోనూ పలు పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదైనట్లు దర్యాప్తులో వెల్లడైంది. పోలీసుల వివరాల మేరకు.. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన జేష్టాది సుమన్ దీపక్‌రాజ్ (43) ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. తన పేరుతో హైదరాబాద్‌లో జేష్టాది సుమన్ గ్లోబల్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఎవర్ ఫస్ట్ ఇంపీరియల్ గ్లోబల్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రెండు సంస్థలు ఉన్నాయని, తనకు అంతర్జాతీయ ట్రేడింగ్ లైసెన్స్ ఉందని పలువురిని నమ్మించాడు.విదేశాలకు ఆహార ఉత్పత్తుల ఎగుమతి వ్యాపారం చేస్తున్నానని, తన సంస్థల్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నిందితుడు గొడుగు శివకుమార్‌ను నమ్మించాడు. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు అందిస్తానంటూ చెప్పడంతో శివకుమార్ రూ.50 లక్షలు పెట్టుబడిగా ఇచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే అనంతరం హామీ మేరకు డబ్బులు, లాభాలు ఇవ్వకుండా మోసం చేయడంతో బాధితుడు ఈ ఏడాది ఏప్రిల్ 11న కడప వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడి ఆచూకీపై దృష్టి సారించారు. ఈ క్రమంలో గురువారం సుమన్ దీపక్‌రాజ్‌ను కడప వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరిచారు.
పలుచోట్ల కేసులు
దర్యాప్తులో నిందితుడు ఇదే తరహాలో పలువురి నుంచి పెద్ద మొత్తంలో నగదు తీసుకుని మోసాలకు పాల్పడినట్లు పోలీసులకు సమాచారం లభించింది. అతనిపై చిన్నచౌక్, కర్నూలు నాలుగో పట్టణం, అమీర్‌పేట, వెల్దుర్తి తదితర పోలీస్‌స్టేషన్లలో గతంలో కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై చిన్నచౌక్ పోలీస్‌స్టేషన్ క్రైం నంబర్లు 228/2015, 57/2015, 151/2018, 140/2026; కర్నూలు టౌన్ పీఎస్ క్రైం నంబర్ 230/2016; అమీర్‌పేట పీఎస్ క్రై ం నంబర్ 323/2025; వెల్దుర్తి పీఎస్ క్రై ం నంబర్ 51/2025 కేసులు ఉన్నట్లు వెల్లడించారు. ట్రేడింగ్, వ్యాపారం పేరుతో భారీ లాభాలు వస్తాయని ఎవరైనా హామీ ఇస్తే పూర్తిస్థాయి వివరాలు పరిశీలించకుండా భారీ మొత్తంలో నగదు ఇవ్వవద్దని పోలీసులు ప్రజలకు సూచించారు.


