కార్యాలయాలకు బ్రేక్..
● కనుమరుగైన క్యూలైన్లు..
● రవాణా శాఖ కార్యాలయాలు వెలవెల
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఒకప్పుడు వాహనదారులతో కిటకిటలాడిన రవాణా కార్యాలయాలు (ఆర్టీఏ) ఇప్పుడు వెలవెలబోతున్నాయి. రవాణా శాఖ పరిధిలోని సేవలను ప్రభుత్వం దశలవారీగా ఆన్‌లైన్‌లోకి తీసుకురావడంతో కార్యాలయాలకు వాహనదారులు రాక గణనీయంగా తగ్గిపోయింది. వైఎస్‌ఆర్ కడప జిల్లాలో ఉపరవాణా శాఖ కమిషనర్ కార్యాలయం ఉంది. ప్రొద్దుటూరులో ఆర్టీవో,పులివెందుల, బద్వేలు, రాజంపేట మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయాలు ఉన్నాయి. గతంలో ఆర్టీఏ కార్యాలయాల్లో సుమారు 83 రకాల సేవలు అందించేవారు. 2016 తర్వాత రవాణా శాఖ సేవలను ఒక్కొక్కటిగా ఆన్‌లైన్ చేస్తూ వచ్చింది. అలా రాను రాను 79 సేవలను ఆన్‌లైన్ ద్వారానే అందుబాటులోకి తీసుకువచ్చింది.
● కొత్త వాహనం రిజిస్ట్రేషన్‌లను 2016 నుంచి రవాణా శాఖ కార్యాలయాల ద్వారా కాకుండా డీలర్స్ కు అప్పగించారు. డీలర్లు రిజిస్ట్రేషన్‌కు కావాల్సిన టాక్స్ కట్టించుకుని వాహనాల ఫోటోలు అప్‌లోడ్ చేస్తే, రవాణా శాఖ అధికారులు ఫొటోలు చూసి అప్రూవ్ చేసేవారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ను రవాణా అధికారుల అప్రూవల్ అవసరం లేకుండా నేరుగా ఆటో అప్రోవల్ అయ్యేలా నిర్ణయం తీసుకుంది.
● 2018కి ముందు వాహనాల పరిమిట్లను, వాహనాలకు చెందిన క్వార్టర్లీ ట్యాక్స్‌లను రవాణా శాఖ కార్యాలయంలో ఇచ్చేవారు. 2018 తర్వాత ఈ రెండు సేవలను ఆన్‌లైన్ చేశారు. అదే విధంగా రవాణా శాఖ ఇచ్చే మరొక కీలకమైన సేవ వాహనాల ఫిట్‌నెస్‌లను 2024 సెప్టెంబర్ 1 నుండి ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించింది.
● ఇటీవల ముఖ్యమంత్రి రవాణా శాఖ సేవలను పరిశీలించి వాహనాల ఫైనాన్స్ క్లియరెన్స్, ఫైనాన్స్ ఎడిషన్, చిరునామా మార్పు సేవలను ఆటో అప్రూవల్ చేసేలా మార్పులు చేయాలని ఆదేశించారు.
● ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్, ఎల్‌ఎల్‌ఆర్, డెత్ సేవలు మాత్రమే కార్యాలయంలో అందుతున్నాయి. గతంలో వాహన రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, పర్మిట్లు, ఇతర రవాణా సంబంధిత సేవలు కోసం కార్యాలయానికి రోజూ వందలాది మంది వాహనదారులు, ఏజెంట్లు, ఇతరులు వస్తున్నప్పుడు సందడిగా కనిపించేవి. కానీ రానురాను సేవలు ఆన్‌లైన్ కావడంతో ప్రస్తుతం ఆర్టీఏ కార్యాలయాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం కార్యాలయంలో ప్రత్యక్షంగా నిర్వహిస్తున్న సేవల్లో ప్రధానంగా వాహన యజమాని మృతి చెందిన సందర్భంలో ఆయన పేరుపై ఉన్న వాహనాన్ని వారసుడు లేదా ఇతర అర్హత కలిగిన వ్యక్తి పేరుపైకి బదిలీ చేసే ప్రక్రియ, ఎల్ ఎల్ ఆర్, డ్రైవింగ్ లైసెన్స్ సేవలు మాత్రమే మిగిలినట్లు సమాచారం. వీటిలో కూడా ఎల్‌ఎల్‌ఆర్, డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేసే ప్రక్రియను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించనున్నట్లు తెలిసింది. అందులో ఇప్పటికే ఒక డ్రైవింగ్ శిక్షణ కేంద్రం మంజూరు అయింది. మరో రెండు కూడా రానున్నట్లు అధికారుల ద్వారా అందిన సమాచారం. ఇక డెత్ సేవ మినహా మిగిలిన దాదాపు అన్ని సేవలు ఆన్‌లైన్‌లోనే అందుబాటులోకి రావడంతో కార్యాలయానికి వచ్చే వారి సంఖ్య బాగా తగ్గింది.
ఉద్యోగుల్లో మానసిక ఆందోళన
ఉప రవాణా శాఖ జిల్లా కార్యాలయం పరిధిలో ప్రొద్దుటూరు, ఆర్టీవో, పులివెందుల, బద్వేలు, రాజంపేట మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయాలు ఉన్నాయి. జిల్లాలో ఒక డీటీసీ , ఒక ఆర్టీవో, పదిమంది మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు, నలుగురు అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు, నలుగురు ఏవోలు, 8 మంది సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు సబార్డినేటర్లు మొత్తం 34 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 700 నుండి 900 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. రవాణా శాఖ సేవలన్నీ క్రమంగా ఆన్‌లైన్‌లోకి వెళ్లిపోతుండటం, ఫిట్‌నెప్, డ్రైవింగ్ లైసెన్స్, ఎల్ ఎల్ ఆర్ సేవలను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగిస్తుండడంతో రవాణా శాఖ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో మానసిక ఆందోళన మొదలైంది. ప్రస్తుతం ఉన్న పనులు కూడా భవిష్యత్తులో పూర్తిగా ఆన్‌లైన్ పరిధిలోకి వెళితే తమ పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఉద్యోగులను వేధిస్తోంది. రవాణా శాఖ ఉద్యోగాల్లో కొనసాగిస్తారా? ఇతర శాఖల్లోకి కలుపుతారా? లేక సిబ్బంది సంఖ్యను తగ్గిస్తారా? అన్న సందేహాలు వారిలో నెలకొన్నాయి. తమ ఉద్యోగ భద్రతపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని పలువురు ఉద్యోగులు కోరుతున్నారు. సేవలు తగ్గుతున్నప్పటికీ తమ అనుభవం, నైపుణ్యాలను ఉపయోగించుకునేలా భవిష్యత్ ప్రణాళిక రూపొందించాలని వారు అభిప్రాయపడుతున్నారు.
ప్రభుత్వం రవాణా శాఖలోని సేవలను వాహనాదారులకు పారదర్శకంగా, సులభతరంగా అందించడానికి ఆన్‌లైన్ చేసింది. వాహనాదారులు ఆన్‌లైన్ సేవలపై అవగాహన పెంచుకొని సద్వినియోగం చేసుకోవాలి.
–వీర్రాజు, జిల్లా ఇన్‌చార్జి ఉప రవాణా శాఖ కమిషనర్
పారదర్శకత కోసమే ఆన్‌లైన్


