కడప అర్బన్ : కడపలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో జూనియర్ వైద్యులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన సమ్మె గురువారం 11వ రోజుకు చేరుకుంది. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు శాంతియుతంగా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని జూనియర్ వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఏపీ జూడా పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ వైద్యులు గురువారం స్వచ్ఛంద రక్తదాన శిబిరాలను నిర్వహించి వినూత్నంగా నిరసనను తెలియజేశారు. ఇందులో భాగంగా జీఎంసీ కడప సమ్మె ప్రాంగణంలో జూనియర్ వైద్యుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కడప జీఎంసీ జూడా అధ్యక్షుడు డాక్టర్ రవితేజనాయక్, ఉపాధ్యక్షుడు డాక్టర్ లక్ష్మీకాంత్, కార్యదర్శి డాక్టర్ మేఘన, ఉపాధ్యక్షులు ఎస్.యశ్వంత్ కృష్ణ, కె.యశ్వంత్‌కృష్ణ మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం చేపడుతున్న ఆందోళనలో భాగంగా 42మంది స్వచ్చందంగా రక్తదానం చేశారన్నారు. ఏడుగురు రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్నారన్నారు. ఈ ఆందోళనలో దాదాపు 300 మంది జూడాలు, హౌస్ సర్జన్‌లు, వైద్య విద్యార్థులు తమ నిరసనను తెలియజేశారు. స్టైఫండ్‌ను 30 శాతం పెంచాలన్నారు. ప్రభుత్వ రంగంలో పని చేస్తున్న డాక్టర్ల వయోపరిమితిని 62 నుంచి 65కు పెంచాలన్న ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
11వ రోజుకు చేరిన జూడాల నిరసన


