ఉద్యోగం రాలేదని మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగం రాలేదని మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

Aug 21 2026 2:57 AM | Updated on Aug 21 2026 2:57 AM

బద్వేలు అర్బన్‌ : ఆ యువకుడు చిన్నతనం నుంచి చదువులో బాగా రాణిస్తుండేవాడు. బీటెక్‌ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. అయితే తోటి స్నేహితులందరికి ఉద్యోగాలు వచ్చినప్పటికీ తనకు ఇంకా రాలేదని మనస్తాపానికి గురయ్యాడు. ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చాడు. గురువారం బద్వేలు పట్టణంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు పట్టణంలోని తెలుగుగంగ రోడ్డులో నివసిస్తున్న బి.వెంగయ్య, జయమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. వారిలో చిన్నవాడైన బొడ్డుబోయినహరిక్రిష్ణ (25) బీటెక్‌ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. తోటి స్నేహితులందరికి ఉద్యోగాలు వచ్చాయి. తనకు ఇంకా రాలేదని తరచూ బాధపడుతుండేవాడు. ఇటీవలే తన తండ్రి వద్ద కూడా ఆ విషయం ప్రస్తావన చేసి బాధపడుతుండటంతో తల్లిదండ్రులు సర్దిచెప్పారు. ఈ క్రమంలో గురువారం ఉదయం తన స్నేహితుడిని కలిసి వస్తానని ఇంటి నుండి వెళ్లిన హరిక్రిష్ణ మధ్యాహ్నం వరకు రాకపోవడంతో తల్లి జయమ్మ ఫోన్‌ చేసింది. ఎంతసేపటికి ఫోన్‌ తీయకపోవడంతో విషయాన్ని వెంగయ్యకు తెలిపింది. ఆయన ఇంటి వద్దకు వచ్చి చుట్టుపక్కల గాలించినప్పటికీ ఫలితం దక్కలేదు. చివరగా అనుమానం వచ్చి హరిక్రిష్ణ నివాసముంటున్న ఇంటి సమీపంలో ఉన్న వారి మరో ఇంటి వద్దకు వెళ్లి చూడగా రేకుల ఇంటికి పైభాగంలో ఉన్న ఇనుపపైపుకు చీరతో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. వెంటనే చుట్టుపక్కల వారిని, బంధువులను పిలిపించి హరిక్రిష్ణను ఆటోలో ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు ధృవీకరించారు. మృతుని తండ్రి వెంగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అర్బన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement