ముద్దనూరు : మండలంలోని మంగపట్నం సమీపంలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న రామాంజనేయులు(49) మృతిపై గురువారం కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ రమేష్ తెలిపారు.ఏఎస్‌ఐ సమాచారం మేరకు అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలోని గరుగుచింతలపల్లె గ్రామానికి చెందిన రామాంజనేయులు గత కొంత కాలంనుంచి ప్రైవేట్ కంపెనీలో ఎలక్ట్రికల్ విభాగంలో పనిచేస్తున్నాడు.బుధవారం సాయంత్రం పనిముగిసిన తర్వాత సమీపంలోనే ఉన్న తన గదికి వెళ్లిడు.గురువారం ఉదయం అతను నిద్రలేయకపోవడంతో గమనించిన తోటి పనివారు బంధువులకు సమాచారం ఇచ్చి అతనిని జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అయితే అప్పటికే అతను మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.రామాంజనేయులు అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడని,మృతిని కుమారుడు ఫణీంద్ర ఫిర్యాదు మేరకు అనుమానాస్పద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.


