నిధుల కోసం రా‘జోలె’ | - | Sakshi
Sakshi News home page

నిధుల కోసం రా‘జోలె’

Aug 20 2026 12:23 AM | Updated on Aug 20 2026 12:23 AM

కడప సిటీ : వైఎస్సార్‌ కడప, నంద్యాల జిల్లాల సరిహద్దుల్లోని కుందూనదిపై ఉన్న రాజోలి రిజర్వాయర్‌ నూతన ప్రాజెక్టు నిర్మాణం అటకెక్కినట్లే కనిపిస్తోంది. ఎప్పుడో బ్రిటీషు కాలంలో నిర్మించిన ఈ ఆనకట్ట మరమ్మతులకు నోచుకోక నీరంతా వృథాగా వెళ్లిపోతోంది. వైఎస్సార్‌ సీపీ హయాంలోనే ఈ ప్రాజెక్టు నూతన నిర్మాణానికి బీజం పడినా.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం భూ సేకరణ విషయంలో మీనమేషాలు లెక్కిస్తోంది. ఎన్నికల సమయంలో రాజోలి ప్రాజెక్టుపై పెద్ద పెద్ద మాటలు వల్లె వేసిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక చిన్నచూపు చూస్తున్నారు.

చారిత్రక నేపధ్యం

బ్రిటీషుకాలంలో 1860–70 మధ్య డచ్‌, బ్రిటీషు ఇంజనీర్లు కుందూ నదిపై రాజోలి ఆనకట్ట నిర్మించారు. అప్పటి నుంచి జిల్లా వాసులకు సాగు, తాగునీరందిస్తూ వస్తోంది. కేసీ కెనాల్‌ వ్యవస్థలో ఈ ఆనకట్ట కీలకపాత్ర పోషించింది. మైదుకూరు, చాపాడు, ప్రొద్దుటూరు ప్రాంతాలకు ఈ ప్రాజెక్టు ద్వారా తాగునీరు అందించేవారు. కాలక్రమేణా పాతకట్ట పూడిక, ప్రాజక్టు దెబ్బతినడంతో నీటిని సమర్థంగా నిల్వ చేసేందుకు కొత్త రాజోలి రిజర్వాయర్‌ నిర్మాణం తలపెట్టారు.

వైఎస్సార్‌సీపీ హయాంలోనే..

2.95 టీఎంసీల సామర్థ్యంతో రాజోలి కొత్త ఆనకట్ట నిర్మాణానికి 2020లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ మేరకు సుమారు రూ.1357.10 కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పించారు. టెండర్లు కూడా పూర్తయ్యాయి.

కూటమి రాకతో..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ‘రాజోలి ఆనకట్ట నిర్మాణంపై ఒక్క అడుగు ముందుకు పడలేదు. రైతులపై చిత్తశుద్ధి కరువై భూ సేకరణ పేరిట కాలయాపన చేస్తోంది. కొత్త నిర్మాణం ఆలస్యమైనా కనీసం ఉన్న గేట్లకు మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. గేట్ల మరమ్మత్తులకు రూ.18.85 లక్షలు మంజూరైనా పనులు జరగకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో లెక్కలేనన్ని హామీలిచ్చిన కూటమి నేతలు ఏరుదాటక ‘గేటు’ కూడా పట్టించుకోకపోవడంపై అన్నదాతలు మండిపడుతున్నారు.

ప్రయోజనాలు

ఈ రిజర్వాయర్‌ ద్వారా జిల్లాలోని కేసీ కెనాల్‌ పరిధిలో ఉన్న దాదాపు 83,489 ఎకరాల సాగు భూమికి నీటి సరఫరా స్థిరపడుతుంది. ప్రొద్దుటూరు పట్టణంతోపాటు చుట్టుపక్కల మండలాలకు శాశ్వతంగా తాగునీటి సమస్య తీరుతుంది. కుందూనదికి తరుచూవచ్చే వరదల ఉధృతిని తగ్గించి నీటిని నిల్వ చేసేందుకు తోడ్పడుతుంది. జిల్లాలోని మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాలతోపాటు కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని సుమారు 91 వేల ఎకరాల సాగునీటి అవసరాలు తీర్చేందుకు ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశారు. ఈ ప్రయోజనాలు చేకూర్చాలంటే కొత్త ప్రాజెక్టు నిర్మాణంతోనే సాధ్యమవుతుంది.

మరమ్మత్తులకు నోచుకోని గేట్లు

వైఎస్సార్‌ సీపీ హయాంలోనే కొత్త ప్రాజెక్టుకు టెండర్లు

సాగుతూ పోతున్న భూ సేకరణ

పట్టించుకోని కూటమి ప్రభుత్వం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement