మైదుకూరు : మైదుకూరు – సింగరాయకొండ జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని మైదుకూరు మున్సిపల్ పారిశుధ్య కార్మికుడు పసల చిన్న వెంకటయ్య (59) దుర్మరణం చెందాడు. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పప్పనపల్లె ఎస్సీ కాలనీకి చెందిన చిన్న వెంకటయ్య తాత్కాలికలక వేతనంపై 5 నెలల కిందట మైదుకూరు మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుడిగా చేరాడు. రోజులాగే విధులకు హాజరయ్యేందుకు బుధవారం తెల్లవారుజామున మోపెడ్‌పై మైదుకూరుకు బయల్దేరాడు. 4.50 గంటల ప్రాంతంలో భూమాయపల్లె సమీపంలోకి రాగానే వెనుక వైపు నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో చిన్న వెంకటయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఢీకొట్టిన అనంతరం వాహనం చిన్న వెంకటయ్య మృతదేహాన్ని కొద్ది దూరం ఈడ్చుకుంటూ వెళ్లడంతో శరీరం నుజ్జునుజ్జుయింది. మృతునికి భార్య ఓబుళమ్మ, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. సంఘటనపై అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి కారణమైన వాహనం కోసం గాలిస్తున్నారు. మైదుకూరు – సింగరాయకొండ జాతీయ రహదారి పనులు నత్తనడకన సాగుతుండటం, పనులు సక్రమంగా చేయకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ రహదారిపై జరిగిన ప్రమాదాల్లో పలువురు మృతి చెందారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని..
సిద్దవటం : కడప–చైన్నె జాతీయ రహదారి ఎస్‌కెఆర్ నగర్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మాడ బాలాజీరావు (45) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. వెంకటేశ్వరపురం గ్రామానికి చెందిన మాడ బాలాజీరావు బుధవారం తెల్లవారుజామున టీ తాగేందుకు నడుచుకుంటూ ఎస్‌కెఆర్ నగర్ వద్దకు వస్తుండగా గుర్తు తెలియని వాహనం అతన్ని ఢీకొంది. అతని తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మృతుని భార్య పార్వతి జీవనోపాధి కోస మూడేళ్ల క్రితం గల్ఫ్ దేశానికి వెళ్లింది. బాలాజీ ప్రతి రోజు కూలి పనికి వెళ్లి తన కుమారుడు పార్థు, కుమార్తె మధుమితను పోషించేవాడు. ప్రమాదం జరిగిన సమాచారం తెలుసుకున్న హైవే పెట్రోలింగ్ పోలీసులు, సిద్దవటం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుని కుమార్తె మధుమిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్‌ఐ సుబ్బరామచంద్ర తెలిపారు.
బ్యాంకు ఉద్యోగిని అదృశ్యంపై వీడని మిస్టరీ
ఆలమూరు : స్థానిక యూనియన్ బ్యాంకులో రూరల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న కడప జిల్లా సింగారెడ్డిపల్లికి చెందిన గానుగపెంట సుప్రియ (28) కోసం గాలింపు చర్యలను ఆలమూరు పోలీసులు ముమ్మరం చేశారు. ఈనెల 17న చొప్పెల్ల లాకుల వద్ద స్కూటర్, తాళం, కళ్లజోడు, పాదరక్షలు వదిలి వెళ్లి తూర్పు డెల్టా ప్రధాన పంటకాలువలో దూకి ఆత్మహత్య చేసుకుందని భావించిన పోలీసులు ఆ దిశగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆమె ఆచూకీ తెలియక అదృశ్యం కాస్త మిస్టరీగా మారింది. ఇప్పటికే సీసీ కెమెరాలు, డ్రోన్ల సాయంతో పరిశీలించినా సుప్రియ ఆచూకీ తెలియకపోవడంతో కాకినాడ నుంచి వచ్చిన ప్రత్యేక ఎస్‌డీఆర్‌ఎఫ్ దళాలతో గాలిపు చర్యలను తీవ్రతరం చేశారు. అయినా ఆ యువతి ఆచూకీ కానరాక అంతటా ఆందోళన నెలకొంది.


