బ్రహ్మంగారిమఠం : బి.మఠంలో ఈనెల 16న గొడ్డలితో అన్నను నరికి చంపిన వజ్రాల సురేష్ ను బుధవారం అరెస్ట్ చేసి బద్వేల్ కోర్టుకు తరలించినట్లు మైదుకూరు రూరల్ సీఐ శివశంకర్ తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ మద్యం మత్తులో ఉన్న సురేష్ ఆదివారం నిద్రిస్తున వజ్రాల వెంకటసుబ్బయ్యను చిన్నవివాదం వల్ల గొడ్డలితో నరికి చంపాడన్నారు. వెంకట సుబ్బయ్య తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నట్లు తెలిపారు, కార్యక్రమంలో ఎస్‌ఐ శివప్రసాద్. పోలీసులు పాల్గొన్నారు.
జాతీయ స్థాయి తపాలాశాఖ లేఖా రచన పోటీలు
ప్రొద్దుటూరు కల్చరల్ : ‘దాయ్ ఆఖర్’పేరుతో తపాలాశాఖ ‘భూమాతకు ఒక లేఖ – ప్రకృతిని రక్షించడానికి నా వాగ్దానం’అనే అంశంపై లేఖలను ఆహ్వానిస్తున్నట్లు ప్రొద్దుటూరు పోస్టల్ సూపరింటెండెంట్ బి.లక్ష్మణ్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. 18 ఏళ్లలోపు వారు ఒక కేటగిరిగా, 18 ఏళ్లు పైబడిన వారిని మరొక కేటగిరిగా పరిగణిస్తూ, విజేతలకు నాలుగు కేటగిరిల్లో మొత్తం 12 బహుమతులు అందిస్తారని ఆయన పేర్కొన్నారు. 2026 జనవరి 1 నాటికి 18 సంవత్సరాల కంటే తక్కువ లేదా పైబడి ఉన్నానని ధ్రువీకరణ పత్రాన్ని జత పరచాలన్నారు. లేఖను తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో రాసి అక్టోబర్ 31వ తేదీలోపు సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్, ప్రొద్దుటూరు డివిజన్, ప్రొద్దుటూరు – 516360 చిరునామాకు పంపాలని సూచించారు.ఎన్వలప్‌పై పంపాలనుకునే వారు ఏ–4 సైజ్ పేపర్‌పై 1000 పదాలకు మించకుండా రాసి పంపాలని, ఇన్‌ల్యాండ్ లెటర్ కార్డుపై రాసే వారు 500 పదాలకు మించకుండా రాయల్సి ఉంటుందన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
తపాలా శాఖ దీన్ దయాల్ స్పర్శ్ యోజన కింద ఉపకరా వేతనాల (స్కాలర్‌షిప్)ను అందిస్తోందని ప్రొద్దుటూరు పోస్టల్ సూపరింటెండెంట్ బి.లక్ష్మణ్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. 6 నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోందని పేర్కొన్నారు. దరఖాస్తులను 2026 సెప్టెంబర్ 16వ తేదీలోపు సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసు, ప్రొద్దుటూరు డివిజన్, ప్రొద్దుటూరు అనే చిరునామాకు పంపాలని సూచించారు.
విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వ వేధింపులు ఆపాలి
కడప సెవెన్‌రోడ్స్ : ఢిల్లీ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై వేధింపులు ఆపాలని వివిధ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కడప కలెక్టరేట్ వద్ద ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నత విద్య పూర్తిగా భ్రష్టు పట్టిందన్నారు. అందుకు ఉదాహరణనే నీట్ పరీక్షా విధానమేనని తెలిపారు. బీజేపీ ప్రభుత్వంలో ఇప్పటికే నీట్ పేపర్ 89 సార్లు లీకేజీ అయ్యిందని, పరీక్ష నిర్వహణలో ఎన్‌టీఏ పూర్తిగా విఫలమైందన్నారు. నీట్ పేపర్ లీకేజీ కారణంగా ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. ఈ ఆత్మహత్యలు అన్ని ప్రభుత్వ హత్యలుగానే భావిస్తున్నామన్నారు. లక్షలాది మంది విద్యార్థులు భవిష్యత్ అంధకారం కాకూడదని కడుపుమండి డిల్లీ లో పోరాటం సాగించి కేంద్రం మెడలు వంచి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చిందని వివరించారు. డిల్లీ పోరాటంలో పాల్గొన్న విద్యార్థులపై కేసులు నమోదు చేస్తూ భయబ్రాంతులకు గురి చేసే విధంగా వేధింపులకు పాల్పడుతున్నదని, ఈ చర్యని వ్యతిరేకిస్తూ ఖండిస్తున్నామని అన్నారు.


