అట్లూరు : నీటితొట్టిలో పడి రెండేళ్ల చిన్నారి మృతి చెందిన సంఘటన సంఘటన అట్లూరు మండలం ఎస్.వెంకటాపురంలోని చూడూరు కాలనీలో చోటు చేసుకుంది. స్థానికులు, బంధువుల వివరాల మేరకు.. చూడూరు కాలనీకి చెందిన మాడపూరు సౌజన్య, హరిలకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రోజువారి కూలి పనుల నిమిత్తం భార్యభర్తలు మంగళవారం చిన్న కుమార్తె వేదశ్రీ(2)ని నాయనమ్మ దగ్గర వదిలి వెళ్లారు. రాత్రి ఆడుతూ ఇంటి సమీపంలోని నీటి తొట్టిలో చిన్ను పడి ఉండటాన్ని నాయనమ్మ చూసి స్థానకులకు సమాచారం ఇచ్చింది. 108 అంబులెన్స్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి పరీక్షించి పాప మృతి చెందిందని చెప్పారు. కూలి పనులకు వెళ్లి రాత్రి ఇంటికి వచ్చే సరికి చిన్ను చనిపోయి ఉండటంతో తల్లిదండ్రులు బోరున విలపించారు.
చేపల దాణా పేరుతో రూ.64 లక్షలు మోసం
ప్రొద్దుటూరు క్రైం : చేపల దాణా సరఫరా పేరుతో వ్యాపారిని నమ్మించి రూ.64 లక్షలు మోసం చేసిన నలుగురిపై బుధవారం వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..మండలంలోని రిలయెన్స్ పెట్రోల్ బంకు సమీపంలో నివాసం ఉంటున్న కాంబోజి చిన్నపుల్లయ్య శ్రీ సాయి యోషిత ట్రేడర్స్ పేరుతో చేపల దాణా వ్యాపారం నిర్వహిస్తున్నాడు. 2025లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన కసిరెడ్డి వీరవెంకట దుర్గాప్రసాద్ ప్రొద్దుటూరులోని చిన్నపుల్లయ్యను సంప్రదించాడు. తాను గతంలో నగరం శ్రీనివాసరావు వద్ద గుమస్తాగా పని చేశానని, చేపల చెరువుల యజమానులకు దాణా విక్రయించి పెడతానని చెప్పాడు. అందుకు గాను తనకు కమీషన్ ఇవ్వాలని కోరగా చిన్నపుల్లయ్య అంగీకరించాడు. ఈ క్రమంలో మొదట మూడు నెలల పాటు దాణా తీసుకున్నందుకు సంబంధించిన డబ్బును దుర్గా ప్రసాద్ క్రమం తప్పకుండా చెల్లించడంతో అతనిపై చిన్నపుల్లయ్యకు నమ్మకం ఏర్పడింది. అనంతరం తన స్నేహితులైన ఉలవకాయల రామస్వామి రమణ, విజయ్, ముద్రగడ రమేష్‌లకు చేపల చెరువులు ఉన్నాయని, వారికి దాణా అవసరమని దుర్గాప్రసాద్ పరిచయం చేశాడు. దుర్గా ప్రసాద్ చెప్పిన మేరకు వారికి చిన్నపుల్లయ్య దాణా సరఫరా చేశాడు. సుమారు రూ. 64 లక్షల విలువైన దాణాకు సంబంధించిన బిల్లులను గుర్తు తెలియని వ్యక్తుల పేర్లతో తయారు చేయించి మోసం చేసినట్లు అతను ఫిర్యాదు చేశాడు. డబ్బులు చెల్లించాలని అడుగగా నిందితులు బెదిరింపులకు పాల్పడుతున్నారని అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి తెలిపారు.


