కడప అర్బన్ : రాష్ట్రవ్యాప్తంగా ఏపీ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో స్టైఫండ్ పెంపు డిమాండ్ తో బుధవారం కడప జీఎంసీ, జీజీహెచ్ ఆవరణలో ఏపీ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ నాయకులు ర్యాలీ నిర్వహించేందుకు ముందుకు వచ్చి బుధవారం పదవ రోజున ఆందోళన కొనసాగించారు. ఇప్పటికే నాన్ ఎమర్జెన్సీ సేవలను బహిష్కరిస్తూ రిలే నిరాహార దీక్షలను చేపట్టిన జూనియర్ డాక్టర్లు ప్రభుత్వం నుంచి తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ రాకపోవడంతో తదుపరి దశకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అత్యవసర సేవలు కూడా నిలిచిపోతే ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయించే పేద, మధ్యతరగతి రోగులపై ప్రత్యక్ష ప్రభావం పడే అవకాశం ఉంది. స్టైఫండ్ లో 30% పెంపు కోసం డిమాండ్ చేస్తూ 2009లో జారీ చేసిన జీవో 287 ప్రకారం ప్రతి రెండేళ్లకు ఒకసారి 15శాతం స్టైఫండ్ పెంపు జరగాల్సి ఉందని జూనియర్ డాక్టర్లు పేర్కొంటున్నారు. ఈ పెంపు ఏడు నెలల పైగా ఆలస్యమైందని చెబుతున్నారు. జూనియర్ డాక్టర్ల సేవలపై ఆధారపడే ప్రభుత్వ బోధనా ఆస్పత్రిలో రోగుల సంఖ్య అధికంగా ఉండడంతో అదనంగా భారం పడుతోంది. ఇప్పటివరకు అత్యవసర విభాగాల్లో సేవలకు ఈనెల 16వ తేదీ వరకు జూనియర్ డాక్టర్లు హాజరవుతూ వచ్చారు. ఈనెల 17వ తేదీ నుంచి అత్యవసర సేవలను కూడా బహిష్కరించి ఆందోళన ఉధృతంగా చేపట్టారు. ఇందులో భాగంగా కడప జీఎంసీ, జీజీహెచ్ (రిమ్స్) ఆవరణలో రిలేదీక్షలను చేపట్టారు. ఈక్రమంలోనే ర్యాలీని నిర్వహించారు. తరువాత ఓపీ భవనంలో నినాదాలు చేసుకుంటూ వెళ్లి అధికారులకు తమ ఆవేదనను వివరించారు.


