పులివెందుల : రైల్వే, ఇన్ఫోసిస్ కంపెనీలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.8లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని అర్బన్ సీఐ శ్రీరామ్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం పట్టణంలోని స్థానిక అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో ఆయన ఎస్‌ఐలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి ప్రజలను మోసం చేసిన రెండు వేర్వేరు కేసుల్లో ఇద్దరు నిందితులను కనంపల్లె చెక్ పోస్ట్, కదిరి చెక్ పోస్ట్‌ల వద్ద విశాఖపట్టణం శ్రీనివాసనగర్‌కు చెందిన నామాల జనప్రకాష్‌రావు, తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం బత్తలవలం గ్రామానికి చెందిన కృష్ణయ్య మహేష్‌లను గుర్తించి పెద్ద మనుషుల సమక్షంలో అరెస్టు చేశామన్నారు. నామాల జనప్రకాష్‌రావు..పులివెందుల పట్టణానికి చెందిన మల్లికార్జునరెడ్డికి ఇన్ఫోసిస్ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి డబ్బులు తీసుకున్నాడన్నారు. అలాగే కృష్ణయ్య, మహేష్ పులివెందుల పట్టణానికి చెందిన సాయి కుమార్‌కు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి ప్రాసెసింగ్ ఫీజు పేరుతో రూ.2లక్షలు తీసుకుని ఉద్యోగం ఇవ్వకపోవడంతో సాయి కుమార్ 2025 మార్చి 24వ తేదీన పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడన్నారు. దర్యాప్తులో భాగంగా నిందితుల వద్ద నుంచి రూ.8,00,000/– నగదును చట్ట ప్రకారం స్వాధీనం చేసుకొని బాదితులకు సత్వర న్యాయం చేసినట్లు చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి డబ్బులు ఇస్తే ఉద్యోగం ఖాయమని చెప్పే మోసగాళ్లను నమ్మొద్దని సీఐ సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు మధుసూదన్‌రెడ్డి, తిమోతి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


