కడప అర్బన్ : ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (ఏపీ జూడా) పిలుపు మేరకు కడపలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్‌లో జూనియర్ వైద్యుల ఫేజ్–3 సమ్మె మరింత ఉధృతమైంది. మంగళవారం రిలే నిరాహార దీక్షల్లో 25 మంది పీజీలు, హౌస్ సర్జన్‌లు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీఎంసీ కడప జూడా అసోసియేషన్ అధ్యక్షుడు రవితేజ నాయక్ మాట్లాడుతూ ఫేజ్–3లో భాగంగా కడపకు చెందిన జూనియర్ డాక్టర్లు అత్యవసర, అత్యవసరం కాని వైద్య సేవలను పూర్తిగా ఉపసంహరించుకుని ఏపీ జూడా అసోసియేషన్ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించామన్నారు. జూనియర్ డాక్టర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిగణనలోకి తీసుకుని, సమస్యలను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఏపీ జూడాతో ఐక్యంగా ఉన్నామన్నారు. ప్రభుత్వం వెంటనే సానుకూలంగా స్పందించాలన్నారు. లేనిపక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కడప జీఎంసీ జూడా వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ లక్ష్మీకాంత్, కార్యదర్శి డాక్టర్ మేఘన, నాయకులు కె.యశ్వంత్‌కృష్ణ, ఎస్.యశ్వంత్‌కృష్ణతోపాటు పీజీలు, హౌస్ సర్జన్‌లు తదితరులు పాల్గొన్నారు.


