బద్వేలు అర్బన్ : పట్టణంలోని పోరుమామిళ్ల బైపాస్‌రోడ్డులో గల ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద తనిఖీలు నిర్వహించి 2.1 కిలోల గంజాయితోపాటు రూ.6 వేలు, ఒక ఎలక్ట్రానిక్ తూనిక యంత్రం స్వాధీనం చేసుకుని ఐదుగురిని అరెస్టు చేసినట్లు అర్బన్ సీఐ బి.రామకృష్ణ తెలిపారు. మంగళవారం స్థానిక అర్బన్ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా పెదచెర్లోపల్లె మండలం లక్ష్మక్కపల్లె గ్రామానికి చెందిన దొడ్డేటిపల్లి రమణయ్య వివిధ ప్రాంతాల్లో తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి.. బద్వేలు ప్రాంతాన్ని అడ్డాగా చేసుకుని కిలో రూ.6 వేలు చొప్పున ఇతర నిందితులకు విక్రయిస్తుండేవాడు. ఈ క్రమంలో మంగళవారం పోరుమామిళ్ళ బైపాస్‌రోడ్డులోని ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద ఎలక్ట్రానిక్ తూనిక యంత్రం ద్వారా ఒక్కొక్కరికి 250 గ్రాముల చొప్పున తూకం వేసి విక్రయిస్తుండగా దాడి చేసి నిందితులను పట్టుకున్నారు. రమణయ్యతోపాటు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లె గ్రామానికి చెందిన షేక్‌చిన్నమీరావలి, ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం మాలేపాడు గ్రామానికి చెందిన వలేరి మల్లిఖార్జున, బద్వేలు పట్టణం మార్తోమానగర్‌కు చెందిన వల్లెపు వెంకటసుబ్బయ్య, ప్రకాశం జిల్లా పెదచెర్లోపల్లె మండలం పెద్దఇర్లపాడు గ్రామానికి చెందిన నాగులూరి రాజమ్మను అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. వీరిలో చిన్నమీరావలి, రాజమ్మపై గతంలో కూడా గంజాయి కేసులు ఉన్నట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐలు యు.వై.జయరాములు, ఎం.రంగారావు, ఏఎస్‌ఐ శ్రీనివాసమూర్తి, హెడ్‌కానిస్టేబుల్ శివయ్య, కానిస్టేబుళ్ళు కె.సుబ్బయ్య, ఎం.సుబ్బయ్య, మహిళా కానిస్టేబుల్ కళ్యాణి పాల్గొన్నారు.


