పులివెందుల రహదారులు.. మారనున్న రూపురేఖలు | - | Sakshi
Sakshi News home page

పులివెందుల రహదారులు.. మారనున్న రూపురేఖలు

Aug 18 2026 12:09 AM | Updated on Aug 18 2026 12:09 AM

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌, ఎంపీ

అవినాష్‌రెడ్డి చొరవతో పనులు

రాజ్యసభ మాజీ ఎంపీ పరిమల్‌

నత్వానీ నిధులతో శ్రీకారం

రూ.1.08 కోట్ల పనులకు

అనుమతి మంజూరు

పులివెందుల : 2026–27 ఎంపీ ల్యాండ్స్‌ నిధుల కింద రూ.1,08 కోట్ల అంచనా వ్యయంతో పులివెందుల మున్సిపాలిటీలో ప్రతిపాదించిన పనులకు రాజ్యసభ మాజీ ఎంపీ పరిమల్‌ నత్వానీ నిధుల కింద పరిపాలనా అనుమతి మంజూరు చేసేందుకు జిల్లా కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలలోకి వెళితే.. మూడు నెలల క్రితం పులివెందుల పర్యటనకు వచ్చిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి, అలాగే కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి దృష్టికి పులివెందుల మున్సిపల్‌ ఇన్‌చార్జి వైఎస్‌ మనోహర్‌రెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ వరప్రసాద్‌ పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని పలు రోడ్ల నిర్మాణాలు చేపట్టాలని తీసుకెళ్లారు. దీంతో వెంటనే స్పందించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్‌ అవినాష్‌రెడ్డిలు అప్పట్లో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న పరిమల్‌ నత్వానీ దృష్టికి తీసుకెళ్లి ఆయన నిధుల నుంచి పనుల ఆమోదానికి ప్రతిపాదనలు పంపడం జరిగింది. ఇందుకు సంబంధించి పరిమల్‌ నత్వానీ నిధుల నుంచి ప్రతిపాదనలు పంపిన పనులకు పరిపాలనా అనుమతులు లభించాయి. దీంతో పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో రూ.1,08,50,000ల పనులకు నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో పెద్దరంగాపురం గ్రామంలోని 5–4–136 నుంచి 5–4273 వరకు 350 మీటర్ల పొడువనా సీసీ రోడ్డు వేసేందుకు రూ.30 లక్షలు, పెద్దరంగాపురం గ్రామంలోని 5–4–39 నుంచి 5–4–110బి వరకు 250 మీటర్ల పొడవునా సీసీ రోడ్డు వేసేందుకు రూ.20 లక్షలు, పులివెందుల మున్సిపాలిటీలో రోజువారీ పారిశుద్ధ్య నిర్వహణ కోసం ట్రాలీతో కూడిన కొత్త ట్రాక్టర్‌ కొనుగోలుకు రూ.18.50 లక్షలు, చిన్నరంగాపురం మెయిన్‌ రోడ్డుకు 600 మీటర్ల పొడవునా అప్రోచ్‌ రోడ్డు వేసేందుకు రూ.40 లక్షల మంజూరుకు ఉత్తర్వులు జారీ చేశారు. రాజ్యసభ మాజీ ఎంపీ పరిమల్‌ నత్వానీ నుంచి అందించిన ప్రతిపాదనలపై పులివెందుల మున్సిపల్‌ కమిషనర్‌ ఈ ఏడాది జూలై 24వ తేదీన సాధాసాధ్యాల నివేదిక సమర్పించారు.

వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలో లేకున్నా..

గత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంలో పులివెందుల నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాలలో సీసీ రోడ్లు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, పలు ఇరిగేషన్‌ పనులు చిత్రావతిలో 10 టీఎంసీల నీటి నిల్వ, పైడిపాలెం రిజర్వాయర్‌లో 6 టీఎంసీల నీటి నిల్వలతోపాటు పులివెందుల పట్టణంలో మెడికల్‌ కళాశాల నిర్మాణం, అరటికి సంబంధించి కోల్డ్‌ స్టోరేజ్‌, బోలేవార్డ్‌లతోపాటు వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. ప్రస్తుతం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో లేకున్నా కూడా పులివెందుల ప్రాంత ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధితో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్‌ అవినాష్‌రెడ్డిలు రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అలాగే బ్రాహ్మణపల్లె, రోటరీపురం ప్రాంతాలలో పలు రోడ్ల నిర్మాణాలకు గత మున్సిపాలిటీ కౌన్సిల్‌ ఆమోదం తెలిపిన పనులకు కూడా త్వరలో జనరల్‌ కేటగిరీ కింద పనుల శ్రీకారానికి ఆమోదం లభించనుంది. దీంతో మున్సిపాలిటీ పరిధిలోని రోడ్ల నిర్మాణాల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఎంపీ చొరవతో చెరువుకు నీటి విడుదల

పులివెందుల రూరల్‌ : పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని వెలమవారిపల్లె గ్రామంలో భూగర్భ జలాలలు అడుగంటిపోయి సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, వెలమవారిల్లె చెరువుకు నీటిని విడుదల చేయాలని ఆదివారం గ్రామస్తులు ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని భాకరాపురంలోని ఆయన నివాసంలో కలిసి విన్నవించారు. దీనికి స్పందించిన ఎంపీ వెలమవారిపల్లె చెరువుకు నీటిని విడుదల చేయాలని పీబీసీ అధికారులతో మాట్లాడారు. దీంతో పీబీసీ అధికారులు సోమవారం పులివెందుల బ్రాంచ్‌ కెనాల్‌ నుంచి వెలమవారిపల్లె చెరువుకు నీటిని విడుదల చేశారు. దీంతో ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement