కడప అర్బన్ : పీజీఆర్‌ఎస్ ఫిర్యాదులను చట్ట పరిధిలో సత్వరం పరిష్కరిస్తున్నట్లు జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మొత్తం 154 ఫిర్యాదులు పీజీఆర్‌ఎస్‌కు వచ్చాయి. ఈ సందర్భంగా ఎస్పీ అర్జీలను పరిశీలించి సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. నిర్ణీత గడువులోపు పరిష్కరించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ శాఖ ద్వారా పరిష్కారం అయ్యే ప్రతి ఫిర్యాదును ప్రజలు స్వేచ్ఛగా తమ దృష్టికి తీసుకురావాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) కె.ప్రకాష్ బాబు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్.సుధాకర్, డీటీసీ డీఎస్పీ అబ్దుల్ కరీం, పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
విద్యార్థి కిడ్నాప్,
దాడి చేసి విడుదల?
చింతకొమ్మదిన్నె : కడప నగరం నెహ్రూ పార్క్ వద్ద ఉన్న చైతన్య పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి పుత్తా విష్ణుసాయిరెడ్డి సోమవారం సాయంత్రం పాఠశాల నుంచి వెళుతూ రాజారెడ్డి వీధిలోని పోలీస్ పెట్రోల్ బంక్ సమీపంలో కిడ్నాప్‌నకు గురి అయినట్లు బంధువులు తెలిపారు. వల్లూరు మండలం కొప్పోలు గ్రామానికి చెందిన పుత్తా ప్రతాప్‌రెడ్డి, సుభాషిణిల కుమారుడు విష్ణుసాయిరెడ్డి చదువు నిమిత్తం రాజారెడ్డి వీధిలోని మేనత్త సుహాసిని ఇంట్లో ఉంటూ పాఠశాలకు వెళ్లి వచ్చేవాడు. సాయంత్రం పాఠశాల 5.30 గంటలకు ముగియగా, రోజూ 5.40 గంటలకు ఇంటికి చేరుకునే వాడు. అయితే సోమవారం సాయంత్రం 6 గంటలు అయినా ఇంటికి రాకపోవడంతో మేనత్త పాఠశాల వద్దకు వెళ్లి విచారణ చేశారు. విష్ణు సాయిరెడ్డి పాఠశాలకు వచ్చి క్లాసులు ముగిసిన తర్వాత వెళ్లిపోయినట్లు పాఠశాల సిబ్బంది తెలిపారు. అనంతరం ఆమె అనుమానంతో సమీపంలోని పార్కులోనూ, తెలిసిన వారిని విచారణ చేయసాగింది. ఈ క్రమంలో విష్ణు సాయిరెడ్డి తన తండ్రి ప్రతాప్‌రెడ్డికి ఫోన్ చేసి కిడ్నాప్‌కు గురి అయి చింతకొమ్మదిన్నె సమీపంలో ఉన్నట్లు సమాచారం ఇచ్చాడు. విష్ణు సాయిరెడ్డి రాజారెడ్డి వీధిలోని పోలీస్ పెట్రోల్ బంకు సమీపంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. తెల్లటి కారులో ముగ్గురు వ్యక్తులు వచ్చి కిడ్నాప్ చేసి, విద్యార్థికి ముసుగు వేసి కొట్టి, అనంతరం చింతకొమ్మదిన్నె సమీపంలోని ఒడ్డు వద్ద కారులో నుంచి తోసినట్లు తెలిపారు. అనంతరం విష్ణుసాయిరెడ్డి ఏడ్చుకుంటూ సమీపంలోని చింతకొమ్మదిన్నె గ్రామం వద్దకు వెళ్లి ఇతరుల ఫోన్ ద్వారా తండ్రికి కిడ్నాప్ విషయం చెప్పాడు. ప్రతాప్‌రెడ్డి ద్వారా సమాచారం అందుకున్న చింతకొమ్మదిన్నెలోని బంధువులు వెళ్లి వారి ఇంటి వద్దకు తీసుకువెళ్లి చింతకొమ్మదిన్నె పోలీసులకు సమాచారం తెలియజేశారు. చింతకొమ్మదిన్నె ఏఎస్‌ఐ నాగరాజు వెంటనే విష్ణుసాయిరెడ్డి ఉన్న బంధువుల ఇంటి వద్దకు చేరుకొని బంధువులను, విద్యార్థిని విచారణ చేశారు.


