ఖాజీపేట : ఖాజీపేట మండలం కుమ్మరకొట్టాలు గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. కడప నుంచి వనిపెంటకు స్కూటీలో వెళుతూ వేగాన్ని అదుపు చేయలేక రాయిని ఎక్కించడంతో కింద పడి.. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన బత్తల లక్ష్మీదేవి తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను రిమ్స్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. మృతురాలి కుమారుడు వెంకట రమణ ఫిర్యాదు మేరకు ఖాజీపేట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
విద్యార్థిని అదృశ్యం
కడప అర్బన్ : కడపలోని కో–ఆపరేటివ్ కాలనీకి చెందిన సోమ శివరాజా, రుక్మిణీల కుమార్తె సోమ పద్మావతి(17) అనే ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని అదృశ్యమైనట్లు సోమవారం రాత్రి తల్లిదండ్రులు కడప వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తిమ్మారెడ్డి తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు ఎవరైనా వుంటే 9121100510, 9121100511, 9121100512 నంబర్లకు సమాచారం తెలియజేయాలని కోరారు.
కరువు జిల్లాగా ప్రకటించాలి
– ఏపీ రైతు సంఘం నేతల డిమాండ్
కడప సెవెన్‌రోడ్స్ : ఖరీఫ్ సీజన్ మొదలై మూడు నెలలు కావస్తున్నా వైఎస్సార్ కడప జిల్లాలో వర్షాలు పడక దుర్భర పరిస్థితులు నెలకొన్నందున వెంటనే కరువు జిల్లాగా ప్రకటించి కేసీ కెనాల్‌తోపాటు ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎంవి. సుబ్బారెడ్డి, పోతిరెడ్డి భాస్కర్ డిమాండ్ చేశారు. ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో వారు మాట్లాడుతూ.. జిల్లాలోని తెలుగు గంగ, పైడిపాలెం, సర్వరాయసాగర్, వామికొండ తదితర ప్రాజెక్టుల పరిధిలో పంట కాలువలు నిర్మించాలని కోరారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులివ్వాలని, రైతులు, కౌలు రైతుల రుణాలన్నింటిని మాఫీ చేసి, తిరిగి రుణాలు ఇవ్వాలని, అన్నదాత సుఖీభవ నిధులను రూ. 50 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. రైతులకు సబ్సిడీతో విత్తనాలు, ఎరువులు, డీజిల్ అందించాలని, యంత్ర పరికరాలను పూర్తి సబ్సిడీతో ఇవ్వాలని కోరారు. లేదంటే పోరాటాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డీఆర్‌ఓ మల్లికార్జునుడికి అందజేశారు.


