కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : తపాలా శాఖ అందిస్తున్న తపాలా జీవిత బీమా (పీఎల్‌ఐ) కుటుంబానికి ఆర్థిక భరోసాను అందించే బీమా పథకం అని కడప డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ జి.రాజేష్ తెలిపారు. సోమవారం నగరంలోని పోస్టల్ ప్రధాన కార్యాలయంలో కడపకు చెందిన ఎం.శివశరత్‌కుమార్ చౌదరి ఎన్‌హెచ్‌ఏఐలో ఇంజనీర్‌గా పని చేస్తూ, 2023 సెప్టెంబర్‌లో రూ.20 లక్షల సమ్ అష్యూర్డ్‌తో పీఎల్‌ఐ పాలసీ తీసుకున్నారు. దురదృష్టవశాత్తు 2025 అక్టోబర్ 19న ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి మృతి చెందడం జరిగిందన్నారు. పాలసీదారుడి నామినీ అయిన ఆయన తల్లి ఎం.రాజేశ్వరికి, పాలసీ క్లెయిమ్ కింద రూ.22,56,318 విలువైన చెక్కును నామినీ అయిన కుమార్తె నిహారిక చౌదరికి అందజేశారు. ఈ సందర్భంగా పోస్టల్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ పీఎల్‌ఐ ద్వారా పాలసీదారునికి జీవిత భద్రతతో పాటు కుటుంబ సభ్యులకు ఆర్థిక రక్షణ లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ అహ్మద్ హుస్సేన్, ప్రధాన తపాలా కార్యాలయ పోస్ట్‌మాస్టర్ జె.సుబ్బరాయుడు, పీఎల్‌ఐ డెవలప్‌మెంట్ ఆఫీసర్ మునాఫ్, బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ లతీఫ్, సిబ్బంది నేసా మహేష్ తదితరులు పాల్గొన్నారు.
ట్రిపుల్ ఐటీలో అసోసియేట్ డీన్‌ల నియామకం
వేంపల్లె : ఆర్జీయూకేటీ పరిధిలోని ఇడుపులపాయ (ఆర్కేవ్యాలీ) ట్రిపు ల్ ఐటీ క్యాంపస్‌లో నూతనంగా అసోసియేట్ డీన్(అకాడమిక్)ల నియామకాన్ని చేపట్టినట్లు డైరెక్టర్, ప్రొఫెసర్ విజయ్ ప్రకాష్, పరిపాలనాధికారి డాక్టర్ పెనుకొండ రవికుమార్ తెలిపారు. కెమిస్ట్రీ విభాగంలో మెంటర్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ బి.ఈశ్వర్ నాయక్‌ను పీయూసీ విద్యార్థులకు, ఈఈఈ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న షేక్ ఖాజా హుస్సేన్‌ను ఇంజనీరింగ్ విద్యార్థులకు అసోసియేట్ డీన్‌లుగా నియమించినట్లు పేర్కొన్నా రు. సోమవారం వారికి నియామక పత్రాలను ఏఓ పెనుకొండ రవికుమార్ అందజేశారు. వారిని పలువురు అధ్యాపకులు, ఆధ్యాపకేతర బృందం అభినందించారు.


