● అమలుకు నోచుకోని ఎన్నికల హామీలు
● కలెక్టరేట్ ఎదుట మాదిగల జేఏసీ ధర్నా
కడప సెవెన్‌రోడ్స్ : రాష్ట్రంలో మాదిగల అభివృద్ధి, సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోందని మాదిగల జేఏసీ జిల్లా అధ్యక్షుడు పెద్దులపల్లి ఓబులపతి ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వ వివక్షను నిరసిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. నిరుపేదలైన ఒక్కో మాదిగ కుటుంబానికి రెండు ఎకరాల వ్యవసాయ భూమి పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా అసైన్‌మెంట్ కమిటీ ఏర్పాటు చేయకపోవడం విచారకరమన్నారు. మాదిగల విషయానికి వచ్చేసరికి అసైన్‌మెంట్ కమిటీ సమావేశం జరగాలంటున్న అధికారులు.. బడా పారిశ్రామికవేత్తలకు మాత్రం వేలాది ఎకరాలు పంచి పెడుతున్నారని ఆరోపించారు. కడప నగరం చెమ్ముమియాపేట గ్రామ పొలం సర్వే నంబరు 601లో ఉన్న 5.70 ఎకరాల భూమిని మాదిగల ఇళ్ల స్థలాలకు కేటాయించాలని కోరారు. గతంలో ఇదే సర్వే నంబరులో కొంత మంది దళితులకు రెవెన్యూ అధికారులు ఇళ్ల స్థలాల పట్టాలిచ్చారని పేర్కొన్నారు. అయితే లియాఖత్ అనే వ్యక్తి ఆక్రమించి మాదిగ చర్మకారులను రానివ్వడం లేదన్నారు. ఆయనకు ఎలాంటి హక్కు లేదని, ఆ భూమిని స్వాధీనం చేసుకుని మాదిగలకు కేటాయించాలన్నారు. అలాగే బాబూ జగ్జీవన్‌రామ్ భవన నిర్మాణానికి స్థలాన్ని మంజూరు చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ నాయకులు పి.బాలసుబ్బయ్య, పి.మల్లికార్జున, కువైట్ సుబ్బరాయుడు, ఎదురూరు బాబు, పి.సునీల్‌కుమార్, జీసీ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.


