లింగాల : మండలంలోని ఎగువ లింగాల గ్రామంలో ఆదివారం సాయంత్రం కత్తి రామచంద్రుడు, కత్తి చంద్రావతిలపై వెన్నపూస నాగప్రసాద్, వెన్నపూస రవితేజలు వేటకొడవళ్లతో దాడులు నిర్వహించారు. ఈ దాడిలో కత్తి రామచంద్రుడు, ఆయన భార్య కత్తి చంద్రావతిలు గాయాలపాలయ్యారు. ఈ విషయమై ఎస్‌ఐ జగదీశ్వరరెడ్డి సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కత్తి రామచంద్రుడు, వెన్నపూస నాగప్రసాద్‌ల మధ్య ఆస్తి విషయమై గత కొంతకాలంగా స్వల్ప ఘర్షణలు జరుగుతుండేవన్నారు. ఇందులో భాగంగా శనివారం కత్తి రామచంద్రుడు కుమార్తె గంగా రాణి సీమంతం నిర్వహించిన తర్వాత వారి బంధువులను బస్టాండుకు వదిలిపెట్టేందుకు రామచంద్రుడు కుమారుడు గంగరాజు ద్విచక్రవాహనంలో తీసుకెళుతుండగా నాగప్రసాద్ ఘర్షణకు పాల్పడ్డారన్నారు. అనంతరం ఆదివారం సాయంత్రం బైకులో వెన్నపూస నాగప్రసాద్, వెన్నపూస రవితేజలు రామచంద్రుడు ఇంటి వద్దకు వెళ్లి వేటకొడవళ్లు, కత్తితో వారిపై దాడి చేశారన్నారు. వారిని హతమార్చేందుకే దాడులు చేశారన్నారు. విషయం తెలిసిన వెంటనే తాము ఘటనా స్థలానికి వెళ్లి గాయాలపాలైన రామచంద్రుడు, చంద్రావతిలను పులివెందుల ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం పంపించడం జరిగిందన్నారు. కత్తి చంద్రావతి ఫిర్యాదు మేరకు వెన్నపూస నాగప్రసాద్, వెన్నపూస రవితేజలపై హత్యాయత్నం కేసును నమోదు చేయడం జరిగిందన్నారు. సోమవారం ఉదయం లింగాల బస్టాండు సమీపంలోని లోపట్నూతల క్రాస్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద ఉన్న మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నామని ఎస్‌ఐ జగదీశ్వరరెడ్డి తెలిపారు. వారిని కోర్టుకు హాజరుపరచడం జరుగుతుందన్నారు. సమావేశంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


