ఖాజీపేట : బంధువుల వివాహం కోసం వెళ్లి తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఖాజీపేట పంచాయతీ కె.బుడ్డాయపల్లె గ్రామానికి చెందిన కణం చైతన్య(24) కడపలోని ఒక షాపింగ్ మాల్‌లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో తుడుమలదిన్నె గ్రామం అంకాలమ్మ ఆలయ సమీపంలోని కాలువలో గ్రామస్తులు మృతదేహాన్ని గుర్తించారు. ఆదివారం ఉదయం గ్రామం వైపు వెళ్తున్న వ్యక్తులు కొందరు కాలువలో మృతదేహం పడి ఉండటం గమనించి గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి వెళ్లిన వారు చనిపోయిన వ్యక్తి.. కె.బుడ్డాయపల్లె గ్రామానికి చెందిన కణం చైతన్యగా గుర్తించారు. వెంటనే అతని బంధువులకు సమాచారం ఇవ్వడంతో.. వారు అక్కడికి చేరుకున్నారు. మృతుడి తండ్రి మోసే ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం రాత్రి తుడుమలదిన్నె గ్రామానికి చెందిన బంధువుల ఇంటికి వివాహ వేడుకలకు హాజరైనట్లు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున సుమారు 2 గంటల ప్రాంతంలో ఇంటికి తిరుగు ప్రయాణం చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇంటి నుంచి వచ్చే మార్గంమధ్యలో ఏదైనా వాహనం ఢీకొని మృతి చెందాడా లేక బైక్ నడపడంలో ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందాడా అనేకోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవ పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని కడప రిమ్స్‌కు తరలించారు.


