ప్రచారంలో హామీల గాలం...
ఎన్నికల వేళ హామీల డప్పు కొట్టి ఆకట్టుకోవడం... అధికారంలోకి రాగానే మూటకట్టి అటకెక్కించడం చంద్రబాబు సర్కారుకు హెరిటేజ్ వెన్నతో పెట్టిన విద్య. ఎప్పట్లాగే ఈ సారికూడా ఉద్యోగ ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు విజయవంతంగా అటకెక్కించారు. హామీల అమలుపక్కనెట్టి తనకే సాధ్యమైన గారడీ లెక్కలతో మాయాజాలం .. కాదు కాదు చంద్రజాలం చేస్తున్నారు.
కడప ఎడ్యుకేషన్: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల కూటమి ప్రభుత్వం దగా చేసింది. ఎన్నికల వేళ ఆయా వర్గాలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని ప్రతి సభలోనూ ఉపన్యాసాలు వల్లె వేసింది. ఈ మేరకు ఎన్నికల మేనిఫెస్టోలోనూ పొందుపరిచింది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇంతవరకు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు మండిపడుతున్నారు. హామీల అమలుకు ఇక ఉద్యమమే శరణ్యమంటూ కార్యాచరణ ప్రణాళిక రచించే పనిలో నిమగ్నమయ్యారు.
కూటమి హామీలు ఇవే..
● రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు, పెన్షన్లు చెల్లించడం, పెండింగ్ బకాయిలను క్లియర్ చేయడం, పెన్షనర్ల కార్పొరేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం.
● ఉద్యోగులకు మెరుగైన పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) అమలు చేస్తాం.
● ఉద్యోగులకు మధ్యంతర భృతి (ఐఆర్)ప్రకటిస్తాం.
● ఉద్యోగులకు చెల్లించే అలవెన్సులు పునఃపరిశీలన.
● కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్), ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్) విధానాన్ని సమీక్షించి, ఉద్యోగులకు ఆమోదయోగ్యమైన పరిష్కారం తీసుకొస్తాం.
● ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల గౌరవాన్ని పునరుద్ధరించి, అనుకూలమైన పని వాతావరణం కల్పిస్తాం.
● ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, మెగా డీఎస్సీని నిర్వహిస్తాం.
హామీల అమలు ఊసే లేదు..
ఉద్యోగ వర్గాలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 12వ వేతన సవరణ సంఘం (పీఆర్సీ)పై ఊసే లేకపోవడాన్ని తప్పుబడుతున్నారు. 12వ పీఆర్సీ 2023 జూలై నుంచి అమలు కావాల్సి ఉండగా, 2026 జూలై పూర్తయినప్పటికీ కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీ కమిటీని పునరుద్ధరించకపోవడం వారి అసంతృప్తికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. అలాగే ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఇప్పటికే నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఏడాది జూలై 1నుంచి ఐదవ డీఏ అమల్లోకి వచ్చింది. ఎన్నికల ముందు పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను ఆరు నెలల్లో చెల్లిస్తామని ఇచ్చిన హామీ రెండేళ్లు గడిచినా నెరవేర్చలేదు. అలాగే 2022 మే నుంచి పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవ్ బకాయిలను ఇంతవరకు ఇవ్వలేదని ఆయా వర్గాల వారు మండిపడుతున్నారు.
ఉద్యోగుల జీవితాలతో కూటమి దగా
మేనిఫెస్టో అమలులో కూటమి ప్రభుత్వం విఫలం
హామీల అమలుకు కదంతొక్కనున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు


