మైదుకూరు : మైదుకూరు మండలం వనిపెంట ఫారెస్ట్ రేంజి పరిధిలో ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడిన ఇద్దరికి శుక్రవారం తిరుపతిలోని ఎర్రచందనం స్మగ్లింగ్ అడిషనల్ జడ్జి సెషన్స్ కోర్టు 5 ఏళ్లు కఠిన కారాగార శిక్ష, ఒక్కొక్కరికి రూ.3 లక్షల జరిమానా విధించినట్టు వనిపెంట ఎఫ్‌ఆర్‌ఓ ఏవీ చలపతి నాయుడు తెలిపారు. జరిమానా కట్టకపోతే అదనంగా ఆరు నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించేలా న్యాయమూర్తి తీర్పు ఇచ్చినట్టు పేర్కొన్నారు. దువ్వూరు మండలం పెద్ద బాకరాపురం గ్రామానికి చెందిన ఎం.రమణారెడ్డి, కె.బాల రంగయ్య అనే వారు వనిపెంట రేంజి పరిధిలోని నీలాపురం బీట్‌లో 2018లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తుండగా పట్టుకొని, వారి నుంచి 295.60 కిలోల బరువు ఉన్న 11 దుంగలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ కేసులో శుక్రవారం తీర్పు వెలువడినట్టు ఎఫ్‌ఆర్‌ఓ పేర్కొన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాలో ఈ తీర్పు ఎంతో ముఖ్యమైనదని ఈ సందర్భంగా ఎఫ్‌ఆర్‌ఓ చలపతి నాయుడు అన్నారు.


