కడప కార్పొరేషన్ : వైఎస్సార్‌సీపీ జిల్లా మహిళా విభాగాన్ని అత్యంత శక్తివంతంగా తయారు చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి సూచించారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డితో కలిసి మహిళా విభాగం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీలో మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పించడం జరిగిందని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక నవరత్న పథకాలన్నీ మహిళల పేరు మీదనే ఇచ్చారని గుర్తు చేశారు. నామినేటెడ్ పదవుల్లో, పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత ఒక్క వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మంత్రివర్గంలో కూడా సగం మందిని మహిళలను తీసుకున్నారని, అత్యంత కీలకమైన హోం శాఖ మహిళకే కేటాయించారన్నారు. మహిళల రక్షణ, భద్రత కోసం దిశ చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. పార్టీ బలోపేతంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, మహిళా నాయకులు, కార్యకర్తలకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తూ, పార్టీ కార్యక్రమాల్లో వారిని మరింత చురుకుగా భాగస్వాములను చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, టీడీపీ నాయకులే మహిళలపై దాడులు చేస్తూ, అఘాయిత్యాలకు పాల్పడుతున్నారన్నారు. ప్రభుత్వం చేస్తున్న మహిళా వ్యతిరేక చర్యలను ప్రజల్లోకి తీసుకుపోవాలన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ మహిళలు సాధికారత సాధించాలని, మహిళా విభాగం శక్తివంతమై రాష్ట్రానికి ఆదర్శప్రాయంగా నిలవాలన్నారు. గెలుపు, ఓటములు ఎలా ఉన్నా ఎన్నికల్లో మనం చేసే యుద్ధం చాలా గొప్పగా ఉండాలన్నారు. మహిళలు పదవులు పొందడంతోపాటు పురుషులపై ఆధారపడకుండా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. సందర్భోచితంగా, వేగంగా నిర్ణయాలు తీసుకోగలగాలని సూచించారు. వైఎస్సార్‌సీపీని గెలిపించాలన్నా, ప్రజలను చైతన్యం చేయాలన్నా, ప్రభుత్వ వ్యతిరేక విధానాలు అందరికీ తెలియజేయాలన్నా అది మహిళలకే సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు టీపీ వెంకట సుబ్బమ్మ, నగర అధ్యక్షురాలు బండి దీప్తి, రమీజా, మల్లీశ్వరి, శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి


