చక్రాయపేట : పవిత్ర పుణ్యక్షేత్రమైన గండిలో శ్రావణ మాస ఉత్సవాలు ప్రారంభ మయ్యాయి. నేడు తొలి శ్రావణ మాస శనివారోత్సవం జరుగనుంది. ఇందుకోసం ఆలయ ప్రాంగణాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. ఆవరణలో పలు దేవతా మూర్తుల డిజిటల్ కటౌట్లు ఏర్పాటు చేశారు. రాత్రి పూట విద్యుద్దీపాలంకరణతో గండి దేదీప్యమానంగా వెలిగి పోతోంది. రాత్రి బస చేయు భక్తుల కాలక్షేప నిమిత్తం హరికథలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా క్యూలైన్లు, తాగునీరు వంటి ఏర్పాట్లు చేసినట్లు ఆలయ సహాయ కమిషనర్ విశ్వనాథ్ తెలిపారు. వీఐపీ పాసులను పూర్తిగా రద్దు చేసినట్లు చెప్పారు.
ప్రత్యేక అలంకరణ
మూలవర్లుకు ప్రత్యేక పూల అలంకరణ చేస్తున్నట్లు ఆలయ ప్రధాన ఉపప్రధాన అర్చకులు కేసరి, రాజారమేష్, ముఖ్య అర్చకులు రాజగోపాలాచార్యులు తెలిపారు. శ్రావణ శనివారాల్లో ఎలాంటి అభిషేకాలు, వాహన పూజలు ఉండవని చెప్పారు. తెల్లవారుజామున 3.30 నుంచి 4 వరకు సుప్రభాతం, 4 నుంచి 4.30 వరకు అభిషేకం, 4.30 నుంచి 5 వరకు అలంకరణ, అనంతరం భక్తులకు స్వామి దర్శనం ఉంటుందని వారు తెలిపారు. మధ్యాహ్నం 12.30, సాయంత్రం 7కు మహానైవేద్యం, మహామంగళ హారతి, తీర్థ ప్రసాద వినియోగ కార్యక్రమాలు ఉంటాయని వారు వివరించారు.
రాయచోటి టౌన్ : ఇద్దరు బైకు దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి ఏడు బైకులను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు. రాయచోటి అర్బన్ సీఐ బీవీ చలపతి కలిసి డీఎస్పీ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గాలివీడు మండలం తూముకుంటకు చెందిన మావిళ్ల వీరారెడ్డి అలియాస్ వీరారెడ్డి నాయుడు, కోటకొండ ఆంజనేయులు అలియాస్ రామాంజులు అలియాస్ గుండు అనే ఇద్దరు అన్నమయ్య జిల్లా, వైఎస్సార్ కడప జిల్లా, అనంతపురం జిల్లాలో బైకులు దొంగలించినట్లు వేర్వేరుగా కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. వీరారెడ్డిపై గతంలో ఇలాంటి బైకు దొంగతనాల కేసులు 37 నమోదు అయినట్లు తెలిపారు. ఈ నేరాలపై జైలుకు వెళ్లి ఆరు నెలల క్రితం బయటికి వచ్చిన తరువాత మళ్లీ కోటకొండ రామాంజనేయులుతో కలసి బైకు దొంగతనాలకు పాల్పడ్డారని తెలిపారు. వీరిని శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు చెప్పారు.


