జమ్మలమడుగు : అక్రమ కేసులు పెడితే భయపడేదని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికార పార్టీకి చెందిన కూటమి నేతలు రోడ్డును బ్లాక్ చేసి సూపర్ సిక్స్– సూపర్ సక్సెస్ పేరుతో గంటల తరబడి మీటింగ్ నిర్వహించి ప్రజలకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగించినా వారిపై ఎటువంటి కేసులు లేవన్నారు. ప్రజల, యువత హక్కులపై పోరాటం చేస్తూ ర్యాలీ చేస్తే పోలీసులు తమపై అక్రమ కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో డీఎస్సీ ఉద్యోగాల నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఫీజురీయింబర్స్‌మెంట్ ఇవ్వడకపోవడంతో విద్యార్థులు ఫీజులు కట్టలేక ఇంటికి వచ్చేస్తున్నారన్నారు. దీనిపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలతోపాటు నిరసన ర్యాలీలు నిర్వహించడం జరిగిందన్నారు. అందులో భాగంగా ఈ ర్యాలీలో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పాల్గొన్నారని పేర్కొన్నారు. అయితే కూటమి నాయకులైన ఆదినారాయణరెడ్డి, భూపేష్‌రెడ్డి ప్రోద్బలంతో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితోపాటు తమ కుటుంబంలోని వారందరిపై, స్థానిక నాయకులతోపాటు అదనంగా మరో 400 మందిపై పోలీసులు కేసులు పెట్టి భయపెట్టే ప్రయత్నం చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ప్రభుత్వంపై పోరాటం చేయడం జరుగుతుందన్నారు. తమ పార్టీ కార్యకర్తలను వచ్చే ఎన్నికల్లో భయపెట్టి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేయాలనుకుంటే పోరాపాటే అన్నారు. ప్రతి ఎన్నికల్లో పోటీలో ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యాక్రమంలో ఎస్‌ఈసీ సభ్యుడు గిరిధర్‌రెడ్డి, అధికార ప్రతినిధి కొమెర్ల మోహన్‌రెడ్డి, మున్సిపల్ విభాగ జిల్లా అధ్యక్షుడు హృషికేశవరెడ్డి, హనుమంతరెడ్డి, పెద్దదండ్లూరు హనుమంతరెడ్డి, మైనార్టీ నాయకులు ముల్లాజానీ, ఫయాజ్‌బాషా, గౌరీనాథ్‌రావు, రాఘవేంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి పాల్గొన్నారు.
శాంతియుతంగా ర్యాలీ చేస్తే కేసులా?
పోలీసుల తీరుపై ఎమ్మెల్సీ మండిపాటు


