కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తున్న ఆఫర్లు సద్వినియోగం చేసుకోవాలని బీఎస్‌ఎన్‌ఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని బీఎస్‌ఎన్‌ఎల్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బీఎస్‌ఎన్‌ఎల్ పరిమిత కాలానికి కేవలం 1 రూపాయి ఫ్రీడం ప్లాన్ ప్రారంభించిందన్నారు. ఇందులో రోజుకు 1 జీబీ హై–స్పీడ్ డేటాతోపాటు 24 రోజుల పాటు ఉచిత అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఉంటుందన్నారు. పీవీ2399 వార్షిక ప్లాన్‌లో భాగంగా బాగా ప్రాచుర్యం పొందిన బీఎస్‌ఎన్‌ఎల్ వార్షిక ప్లాన్‌కు అదనంగా 47 రోజుల వ్యాలిడిటీ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో మొత్తం వ్యాలిడిటీ 412 రోజులకు పెరుగుతుందన్నారు. రోజుకు 2 జీబీ హై–స్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ లభిస్తాయన్నారు. ఈ ప్రత్యేక ఆఫర్లు ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 12 వరకు అందుబాటులో ఉంటాయన్నారు. అదే విధంగా బీఎస్‌ఎన్‌ఎల్ ఎఫ్‌టీటీహెచ్ సేవల ద్వారా అందించే హై–స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ జిల్లాలోని అన్ని మండలాల్లో విస్తరించినట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా పైబర్ బేసిక్ ప్లాన్ కొత్త వినియోగదారులకు మొదటి నెల పూర్తిగా ఉచితమన్నారు. తదుపరి 3 నెలలకు నెలకు రూ.399, ఆ తరువాత నెలకు రూ.499 చొప్పున చార్జీ ఉంటుందన్నారు. ఈ ప్రత్యేక ప్రారంభ ఆఫర్ ఈ నెల 1 నుంచి 90 రోజుల పాటు చెల్లుబాటులో ఉంటుందని వివరించారు.


