కమలాపురం : పట్టణ పరిధిలోని క్రాస్ రోడ్డు వద్ద అక్కదేవతల కాలనీకి చెందిన మార్పురి మురళీ మహేష్(32) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. మురళి మహేష్ ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. భార్య విన్నీతో మనస్పర్థల కారణంగా తరుచూ ఘర్షణ పడేవారు. అయితే భార్య 20 రోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది. రెండు రోజుల క్రితం మురళి అత్తింటికి వెళ్లి ఇంటికి రావాలని పిలిచాడు. దీనికి భార్య నిరాకరించడంతో మనస్తాపం చెంది శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అతడిని కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మురళి మృతి చెందినట్లు అక్కడి వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి చిన్న వయస్సు గల కుమారుడు ఉన్నాడు. మహేష్ మృతితో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


