రాజంపేటలోని రెండో ప్లాట్‌ఫారం వైపు అండర్ బ్రిడ్జికి సమీపంలో నిలువునా ఎండిపోయిన ఓ భారీ వేపవృక్షం ఎప్పుడు ఎవరి నెత్తిన విరిగిపడుతుందోనని స్థానికులు, విద్యార్థులు ప్రాణభయంతో అల్లాడుతున్నారు. ఈ వృక్షం కింది భాగంలో వేర్లు సైతం భూమితో పట్టు కోల్పోవడంతో, స్వల్ప గాలి వీచినా నేలకొరిగేందుకు సిద్ధంగా ఉంది. నిత్యం ప్రభుత్వ హైస్కూల్, జూనియర్, డిగ్రీ కళాశాలలకు వెళ్లే వందలాది మంది విద్యార్థులు ఈ మార్గం గుండానే రాకపోకలు సాగిస్తుంటారు. దీనికి తోడు చెట్టుకు కూతవేటు దూరంలోనే టిఫిన్ సెంటర్లు, హోటళ్లు, చికెన్ సెంటర్ వంటి చిరు దుకాణాలు ఉండటంతో నిత్యం ప్రజల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రమాదకర వృక్షాన్ని తొలగించాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు కన్నెత్తి చూడలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోనీ, తమ సొంత డబ్బులతో చెట్టును కొట్టేద్దామన్నా.. అటవీ లేదా రెవెన్యూ అధికారులు ఎక్కడ కేసులు పెడతారోనని జనం జంకుతున్నారు. జరగరాని ప్రమాదం జరిగి ప్రాణనష్టం సంభవిస్తే అధికారులదే పూర్తి బాధ్యతని, తక్షణమే స్పందించి ఈ భారీ ఎండిన వృక్షాన్ని తొలగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. –రాజంపేట


