అవయవదానం.. అమరత్వం | - | Sakshi
Sakshi News home page

అవయవదానం.. అమరత్వం

Aug 13 2026 12:57 AM | Updated on Aug 13 2026 12:57 AM

ఆర్టీసీ డ్రైవర్‌ నేత్రదానం

ప్రొద్దుటూరు : స్థానిక భవాని కాలనీకి చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ వర్ర రఘునాథరెడ్డి (54) అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. ఆయన సతీమణి గంగాదేవి(టీచర్‌), కుమారులు మాధవరెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, బావ మరిది అనంతపురం సీఐ శివగంగాధర్‌రెడ్డి నేత్రదానికి అంగీకరిస్తూ జిల్లా అంధత్వ నివారణ సంస్థ, స్నేహిత అమృత హస్తం సేవా సమితి నేత్ర సేకరణ కేంద్రం అధ్యక్షుడు రాజుకు సమాచారం ఇచ్చారు. బుధవారం రఘునాథరెడ్డి మృతదేహం నుంచి టెక్నీషియన్‌ అరవింద్‌ కార్నీయాలను సేకరించి హైదరాబాద్‌లోని డాక్టర్‌ అగర్వాల్‌ నేత్ర నిధికి తరలించారు. సేవా సమితి అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ వర్ర రఘునాథరెడ్డి కుటుంబ సభ్యులు తీసుకున్న ఈ మానవతా నిర్ణయం వల్ల ఇద్దరు అంధులకు చూపు వస్తుందన్నారు.

ఆయన కళ్లు సజీవం

పులివెందుల రూరల్‌ : పులివెందులకు చెందిన వైఎస్‌ ఆనంద్‌రెడ్డి (87) ఈ ఏడాది జులై 30న మృతి చెందారు. ఆయన తమ మధ్య భౌతికంగా లేనప్పటికీ ఆయన కళ్లు మరొకరికి చూపునివ్వాలన్నది కుటుంబ సభ్యులు కోరిక. వెంటనే నేత్రసేకరణ కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి కార్నియాలను సేకరించారు. దీనివల్ల ఇద్దరికి చూపు లభించింది.

ప్రొద్దుటూరు కల్చరల్‌ మరణం ప్రతి జీవికి అనివార్యం. కానీ మరణానంతరం కూడా జీవించడం సాధ్యమేనా? శరీరం నశించినా మన ఉనికి కొనసాగుతుందా? ఈ ప్రశ్నలకు అవయవ దానమే స్పష్టమైన సమాధానం. ఒక మనిషి మరణించినా అతని గుండె మరో శరీరంలో కొట్టుకోవచ్చు. అతని కళ్లు మరో ప్రపంచాన్ని చూడవచ్చు. అతని కాలేయం, మూత్రపిండాలు, మరికొందరికి కొత్త జీవితాన్ని ప్రసాదించవచ్చు. మరణానంతరం కూడా మనిషిని జీవింపజేసే మహోన్నత దానం అవయవదానం. నేడు ప్రపంచ అవయవదాన దినోత్వవం సందర్భంగా కథనం.

24 ఏళ్లుగా ఆరోగ్యంగా జీవిస్తున్న అవయవ స్వీకర్త

అవయవదానం వల్ల రెండో జీవితాన్ని పొందిన ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త, రోటరీ క్లబ్‌ అధ్యక్షుడు కొవ్వూరు రమేష్‌రెడ్డి ఇప్పుడు వేల మందికి జీవదాన సందేశాన్ని చేరవేస్తూ అమరత్వం అంటే ఏమిటో సమాజానికి చెబుతున్నారు. రెండు కుటుంబాల మహోన్నత నిర్ణయంతో తనకు పునర్జన్మ లభించిందని చాటుతున్నారు. 24 ఏళ్ల కిందట తనకు లివర్‌, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ జరిగినా ప్రస్తుతం ఆరోగ్యంగా జీవిస్తున్న కొవ్వూరు రమేష్‌రెడ్డి అవయవదానంపై ప్రజల్లో చైతన్యవంతులను చేసేందుకు కృషి చేస్తున్నారు. ఈయనకు 2002లో లివర్‌ సమస్య ఏర్పడటంతో డాక్టర్లు లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయాలని చెప్పారు. ఆయన మిత్రులు హైదరాబాద్‌ గ్లోబల్‌ హాస్పిటల్‌లో లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేస్తారని చెప్పడంతో హాస్పిటల్‌లోనే ప్రథమంగా లివర్‌ మార్పిడిని 2003 మార్చి 11న చేయించుకున్నారు. డాక్టర్లు 10 ఏళ్లు ఆరోగ్యంగా జీవించవచ్చని తెలిపారు. వరంగల్‌కు చెందిన ఓ యువతి ఆయనకు లివర్‌దానం చేశారు. 2009లో కిడ్నీ సమస్య ఏర్పడటంతో గుంటూరుకు చెందిన ఓ యువకుడు బ్రెయిన్‌ డెత్‌ అవడంతో అతడి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ జరిగింది. మంచి ఆహారపు అలవాట్లు, వైద్యుల సూచనలను తప్పక పాటిస్తూ ఇప్పటికీ 24 ఏళ్లుగా ఆరోగ్యవంతంగా జీవిస్తున్నారు. ఇద్దరి అవయవదానంతోనే తాను ఆరోగ్యంగా ఉన్నానని తన పునర్జన్మకు కారణమైన అవయవదానంపై విస్తృత ప్రచారం చేస్తున్నానన్నారు. తనకు లభించిన జీవితాన్ని మరికొంత మందికి ఇవ్వాలనే సంకల్పంతో అవగాహన ఉద్యమాన్ని ప్రారంభించారు. తనకు కాలేయం దానం చేసిన యువతి జ్ఞాపకార్థం కొవ్వూరు రమేష్‌రెడ్డి చారిటబుల్‌ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి 10 వేల మంది మహిళలకు పావలా వడ్డీకి రుణాలు అందించారు. మెగా ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. కుట్టు శిక్షణ తరగతులను నిర్వహించి 800 కుట్టుమిషన్‌లను మహిళలకు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలను పంపిణీ చేశారు.

విస్తృత అవగాహన

అవయవదానంపై ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు 2014 సెప్టెంబర్‌ 4న ప్రొద్దుటూరు నుంచి తిరుమలకు సుదీర్ఘ పాదయాత్ర చేశారు. 2016 ఫిబ్రవరిలో తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయం నుంచి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం వరకు మరో చైతన్య యాత్ర చేపట్టి 29 రోజుల్లో పూర్తిచేశారు. కళాశాలలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార, ఉద్యోగ, రాజకీయ ప్రతినిధులకు అవయవదానంపై అవగాహన కల్పించి దారి వెంట కరపత్రాలను పంపిణీ చేశారు. ఆయన ఆరోగ్యం, ఆహార అలవాట్లపై వైద్యులు వివరాలు తెలుసుకున్నారు. గతేడాది ఫిబ్రవరిలో అవయవ దానంపై అవగాహన కల్పిస్తూ రన్‌ ఫర్‌ లైఫ్‌ పేరుతో 9 వేల మందికి పరుగు పోటీలను నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల స్థాయి 3కే, 5కే పరుగు పోటీలను నిర్వహించి విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. ఇటీవల పట్టణంలో 130 మంది వైద్యులు, వైద్య సిబ్బందితో భారీ ర్యాలీ నిర్వహించారు. అవయవదానంపై అవగాహన కల్పించి పలువురిని ఒప్పించి అంగీకారపత్రాలు తీసుకున్నారు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్యకార్యకర్తల సంఘం సహకారంతో అవయవదానంపై అవగాహన కల్పించి 65 మందితో అవయవదాన పత్రంపై సంతకాలు చేయించారు. ఇప్పటి వరకు కళాశాలలు, స్వచ్ఛంద సంస్థలు, వైద్య కళాశాలు, రోటరీ, ఉద్యోగ, విద్యాసంస్థల్లో 400 వరకు సదస్సులు నిర్వహించి అవయవదానానికి ప్రజలు ముందు వచ్చేలా కృషి చేస్తున్నారు.

నేడు ప్రపంచ అవయవదాన దినోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement