సింహాద్రిపురం : ఐచర్ లారీ సింహాద్రిపురం సమీపంలో నందాలంబావి వద్ద ప్రమాదకరమైన మలుపు వద్ద బుధవారం వేకువజామున అదుపుతప్పి బోల్తా పడింది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణా నుంచి అరటి కాయల లోడుతో వెలిదండ్లకు వెళుతున్న ఐచర్ వాహనం ప్రమాదకర మలుపు వద్దకు రాగానే అదుపు తప్పి బోల్తా పడింది. వాహనంలో డ్రైవర్ మాత్రమే ఉన్నాడు. అతనికి స్వల్ప గాయాలయ్యాయి. సింహాద్రిపురం నుంచి వెళ్లిదండ్లకు వెళ్లే రోడ్డు 12 కిలోమీటర్ల దూరానికి 13 ప్రమాదకరమైన మలుపులు ఉన్నాయి. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఈ మలుపులను తొలగించి డబుల్ రోడ్డు వేయాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని కోరతున్నారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతి
ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్‌లోని రెండో ప్లాట్‌ఫాంలో ఉన్న ఫుట్‌ఓవర్ బ్రిడ్జి కింద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉన్నాడని రైల్వే ఎఎస్‌ఐ గురుశంకర్‌రెడ్డి బుధవారం తెలిపారు. మృతుడికి సుమారు 45 సంవత్సరాలు ఉంటాయని, బక్కచిక్కి ఉన్నాడని తెలిపారు.ఎవరైనా గుర్తు పడితే ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్ కు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.
పాముకాటుతో వ్యక్తి మృతి
పెండ్లిమర్రి : మండలంలోని చెన్నంరాజుపల్లె హరిజనవాడకు చెందిన దేవర చిన్న ఓబులేసు(39) పాము కాటుకు గురై చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు చిన్న ఓబులేసు వెల్లటూరులోని వేరుశనగ కాయల మిల్లులో పని చేస్తుండంగా ఈనెల 1వ తేదీన పాము కాటుకు గురయ్యాడు. చికిత్స నిమిత్తం కడపలో ప్రైవేట్ ఆసుపత్రికి అక్కడి నుంచి వేలూరు సీఎంసీకి తరలించారు. అక్కడ పరిస్థితి మొరుగు పడకపోవడంతో మళ్లి కడప రిమ్స్ అసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. బుధవారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఆస్తి వివాదం: వ్యక్తిపై దాడి
కొండాపురం : మండల పరిధిలోని సిరిగేపల్లెగ్రామంలో ఆస్తి వివాదం కారణంగా బుధవారం ఓ వ్యక్తి పై దాడి జరిగింది. తాళ్లప్రొద్దుటూరు ఎస్‌ఐ కథనం మేరకు..బండ బాలన్న తల్లితండ్రులకు సంబంధించిన వ్యవసాయ భూమి సర్వే నంబర్ 36–1 లో 50 సెంట్లు వారసత్వంగా వచ్చింది. మిగిలిన భూమి తన సోదరులతో ఒక ఎకరం కొనుగోలు చేశాడు. రెండు గంటల సమయంలో బాలన్న ఇంటి దగ్గర భూమి వివాదంపై ఎడమ చెంపపై రాళ్లతో బి. వెంకటస్వామి, బి. రాజు, బి.వెంకటేష్ కొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
గాలేరు–నగరికాలువలో
వృద్ధుడి మృతదేహం
ముద్దనూరు : మండలంలోని శెట్టివారిపల్లె పరిధిలో గాలేరు–నగరి ప్రధాన కాలువలో హెడ్‌రెగ్యులేటర్ వద్ద బుధవారం వృద్ధుని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. చెన్నూరు బెస్తకాలనీకి చెందిన శ్రీనివాసులు(60)అనే వ్యక్తి కాలువలో పడి నీటమునిగి మృతిచెందాడు.పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు.ఇతను ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతిచెందాడా లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనే వివరాలు తెలియాల్సి ఉంది.


