జెడ్పీ ఉద్యోగాల కుంభకోణంలో సూత్రధారుల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

జెడ్పీ ఉద్యోగాల కుంభకోణంలో సూత్రధారుల అరెస్ట్‌

Aug 13 2026 12:57 AM | Updated on Aug 13 2026 12:57 AM

వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ విశ్వనాథ్‌

కడప అర్బన్‌ : ప్రభుత్వ కారుణ్య నియామక ప్రక్రియలోని లొసుగులను ఆసరాగా చేసుకుని జిల్లాలో భారీ కుంభకోణానికి పాల్పడిన ఇరువురు ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గతంలో జెడ్పీ కార్యాలయంలో పనిచేసిన ఇద్దరు సస్పెండెడ్‌ ఉద్యోగులే ఈ మోసానికి ప్రధాన సూత్రధారులుగా పోలీసులు గుర్తించారు. బద్వేల్‌ ఈఈపీఆర్‌ఐ లో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేసిన సయ్యద్‌ మస్తాన్‌ వల్లి, కమలాపురం ఎంపీపీ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేసిన చిలుమారు శ్రీనివాసులరెడ్డిలను ఈ వ్యవహారంలో అరెస్ట్‌ చేసినట్లు జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ బుధవారం వెల్లడించారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం జిల్లా పరిషత్‌ కార్యాలయంలో విధులు నిర్వహించిన సమయంలో నిందితులు ఇక్కడి రికార్డుల్లోని లొసుగులను గుర్తించి మోసానికి శ్రీకారం చుట్టారు. జెడ్పీ ఉన్నతాధికారుల సంతకాలు, ముద్రలను ఫోర్జరీ చేసి నకిలీ కారుణ్య నియామక ఉత్తర్వులు సృష్టించారు. 25 మంది అభ్యర్థుల నుంచి దాదాపు రూ.2 కోట్లను వసూలు చేసి వారికి ఈ నకిలీ ఉత్తర్వులు అందించారు. ఈ ఉత్తర్వుల ఆధారంగా ఉద్యోగాల్లో చేరిన వారికి కొన్నేళ్లుగా ప్రభుత్వం జీతాలు చెల్లిస్తుండడంతో ఖజానాకు సుమారు రూ.3.80 కోట్ల నష్టం వాటిల్లినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. జిల్లాలో కారుణ్య నియామకాల ప్రక్రియలో తీవ్ర అవకతవకలను గుర్తించిన కడప జిల్లా పరిషత్‌ సీఈఓ సుబ్రమణ్యం ఈ మేరకు ఈ నెల 3వ తేదీన చేసిన ఫిర్యాదుతో ఈ మొత్తం వ్యవహారం వెలుగులోనికి వచ్చింది. నకిలీ నియామక ఉత్తర్వులతో జెడ్పీ హైస్కూళ్ల ఆఫీస్‌ సబార్డినేట్లుగా, వాచ్‌మెన్లుగా ఉద్యోగాల్లో చేరిన 25 మంది అభ్యర్థుల పాత్రపైనా పోలీసులు ప్రస్తుతం లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. వీరంతా బాధితులా లేక ముందే తెలిసి నిందితులతో చేతులు కలిపారా అనే కోణంలోనూ విచారణ సాగుతోంది. ఈ వ్యవహారంతో సంబంధమున్న అందరిపై చర్యలు ఉంటాయని ఎస్‌పీ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement