కడప కార్పొరేషన్ : ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాల బృందం కోరింది. బుధవారం విజయవాడ తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలతో కలిసి వారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే ఉద్యోగంలో కొనసాగుతున్న వేలాది మంది ఉపాధ్యాయులు పదోన్నతులు, ఇతర సర్వీస్ ప్రయోజనాల కోసం మళ్లీ టెట్ రాయాల్సి వస్తుండటం తీవ్ర ఇబ్బందికరంగా మారిందన్నారు. దీర్ఘకాలంగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న వారికి ఈ నిబంధన గుదిబండగా మారిందని, కేవలం ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల్లో మార్పులు చేయడం కాకుండా ఇన్–సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి పూర్తిస్థాయి మినహాయింపు కల్పించేలా అవసరమైతే చట్ట సవరణ చేయాలని కోరారు.ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తిపై స్పందించిన వైయస్ జగన్‌ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు చొరవ తీసుకున్నారు. ఇందులో భాగంగా కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీన కేంద్ర విద్యాశాఖ మంత్రితో ప్రత్యేక భేటీకి ఏర్పాట్లు చేశారు.
ఈ భేటీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ సంఘాల నేతలతో కూడిన ప్రతినిధి బందంతో పాటు వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ సభ్యులు కూడా పాల్గొననున్నారు. రాష్ట్రంలోని ఇన్–సర్వీస్ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్య తీవ్రతను కేంద్ర విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి టెట్ నుంచి మినహాయింపు కల్పించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురానున్నారు. వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఎంవీ రామచంద్రారెడ్డి, కె. కల్పలత, పి.చంద్రశేఖర్‌రెడ్డి, ఏపీవైఎస్సార్‌టీఏ రాష్ట్ర అధ్యక్షుడు కేశవరపు జాలిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ జంషీద్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సీకే వెంకటనాథరెడ్డి, గౌరవాధ్యక్షుడు పి. అశోక్ కుమార్, , కడప జిల్లా అధ్యక్షుడు ఎస్. అమర్‌నాథ్, ఫ్యాఫ్టో జిల్లా అధ్యక్షుడు సంగమేశ్వర్ పాల్గొన్నారు.
మాజీ సీఎం వైఎస్ జగన్‌కు కోరిన
ఉపాధ్యాయ సంఘాల బృందం


