జమ్మలమడుగు రూరల్ : మండల పరిధిలోని గండికోట కొట్టాల గ్రామానికి చెందిన పోలు లక్షుమ్మ (75) అనే వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాలు ఉన్నాయి. గండికోట కొట్టాల గ్రామానికి చెందిన పోలు లక్ష్ముమ్మకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2 ఏళ్ల క్రితం ఆమె ఆస్తిని ఇద్దరు కుమారులకు పంపకం చేసింది. ఉన్న కాస్తో కూస్తో డబ్బును, కొంత భాగం భూమిని తన జీవనానికి పెట్టుకొంది. చిన్న కుమారుడైన మల్లేష్ వద్ద ఆమె ఉంది. ఇటీవల కొంత నగదు లక్ష్ముమ్మ ఖాతాలో జమ అయింది. దీంతో పెద్ద కుమారుడు భార్య ఇంటికి వచ్చి గొడవ పడింది. దీంతో ఇద్దరు కుమారులు ఎక్కడ గొడవ పడి.. కొట్లాడుకుంటారో అని భావించి ఆమె వద్ద ఉన్న కొన్ని మాత్రలు సోమవారం రాత్రి వేసుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం నిద్ర లేవకపోవడంతో.. అనుమానం వచ్చి చూశారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. చిన్న కుమారుడు మల్లేష్.. తల్లి మృతిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.


