● గండిలో ఓహెచ్‌ఎస్‌ఆర్ నిరుపయోగం
● ఫిల్టర్,పైపులైన్ కనెక్షన్లకు నిధుల కొరత
చక్రాయపేట : గండి వీరాంజనేయ స్వామి సన్నిధిలో ఈ ఏడాది శ్రావణ మాస ఉత్సవాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు తాగు నీటి ఇక్కట్లు తప్పేలా లేవు. భక్తుల సౌకర్యార్థం నీటి ఎద్దడి లేకుండా ఉండేందుకు నూతనంగా నిర్మించిన ఓహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంకుకు ఫిల్టర్ వేసి పైపులైన్ల కనెక్షన్లు ఇవ్వక పోవడమే ఇక్కడ ప్రధాన సమస్యగా కనిపిస్తోంది. వివరాలు..గండిలో భక్తుల సౌకర్యార్ధం లక్ష లీటర్ల సామర్థ్యంతో ఓహెచ్‌ఎస్‌ఆర్ నిర్మించాలని ఆలయ మాజీ చైర్మన్ కావలి కృష్ణతేజ, చక్రాయపేట జెడ్పీటీసీ సభ్యుడు శివప్రసాదరెడ్డిలు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ రామగోవిందరెడ్డిల దృష్టికి తీసుకెళ్లారు.ఇందుకు జెడ్పీ చైర్మన్ రు.25లక్షలు జెడ్పీ నిధుల(15వ ఆర్థిక సంఘం)నుంచి మంజూరు చేశారు. ఆ నిధులతో 40వేల లీటర్ల సామర్థ్యంతో ట్యాంకు నిర్మించేందుకు టెండర్లు నిర్వహించారు. పనులు ప్రారంభించి ట్యాంక్ నిర్మాణం పూర్తి చేశారు. ఓహెచ్‌ఎస్‌ఆర్ పనులు చేసిన కాంట్రాక్టర్ రామసుబ్బారెడ్డి స్వామిపై భక్తితో తన సొంత నిధులు కొంత వెచ్చించి 40 వేల లీటర్ల సామర్థ్యం అయితే 60 వేల లీటర్ల నీళ్లు పట్టేలా నిర్మించారు. పనులన్నీ సుమారు రెండు నెలల క్రితమే పూర్తయ్యాయి,
కనెక్షన్ ఇవ్వక పోవడంతో
ఓహెచ్‌ఎస్‌ఆర్‌కు కనెక్షన్ ఇవ్వక పోవడంతో అది నిరుపయోగంగా మారనుంది.పాపాఘ్ని నదిలో ఫిల్టర్ వేసి మోటారు బిగించి ట్యాంకుకు కనెక్షన్ ఇస్తే వెంటనే అది భక్తులకు అందుబాటులోకి వస్తుంది.ఫిల్టర్ మోటర్,పైపు లైన్లకు నిధుల లేమి కారణంగా ఏమి చేయలేక పోతున్నట్లు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు పేర్కొంటున్నారు. కూటమి నేతలు కలెక్టర్‌తో మాట్లాడి ఆయన ద్వారా నైనా నిధులు మంజూరు చేయిస్తే ఓహెచ్‌ఎస్‌ఆర్ అందుబాటులోకి వస్తుందని భక్తులు పేర్కొంటున్నారు.


